ఈ సమస్య జాతీయ భద్రత,ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. చైనా రుణ యాప్ లపై కేంద్రం ఫైర్ 

By Rajesh KarampooriFirst Published Oct 31, 2022, 3:40 AM IST
Highlights

భారతదేశంలో చైనీస్ లెండింగ్ యాప్‌ల ముప్పు రోజురోజుకు పెరుగుతుంది. వాటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ సమస్య జాతీయ భద్రత,ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.  

చైనా నియంత్రిత మైక్రో ఫైనాన్స్, లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. వాటి వేధింపులను తట్టుకోలేక  చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. అధికంగా వడ్డీలు విధిస్తూ.. అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాయి. లేదంటే.. బ్లాక్ మెయిల్ చేస్తామని బెదిరిస్తుండటంతో చాలా మంది అమయాకులు గత్యంతరం లేక డబ్బులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా వేలల్లో అప్పులిచ్చి.. లక్షల్లో వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలా రోజురోజుకు లోన్ యాప్ సంస్థల ఆగడాలు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 

నేరస్థులను కఠినంగా శిక్షించాలని  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అంశం జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, పౌర భద్రతపై తీవ్ర ప్రభావం చూపిందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిన లేఖలో పేర్కొంది. రుణదాతలచే బ్లాక్‌మెయిలింగ్ ,  బెదిరింపు వ్యూహాలతో సహా ఈ యాప్‌ల నుండి రికవరీ గురించిన ఆందోళనలను లేవనెత్తింది.

ఈ చట్టవిరుద్ధమైన యాప్‌లు సులభంగా రుణాలు ఇవ్వడానికి వీలు కల్పిస్తున్నందున, ముఖ్యంగా పేద, తక్కువ-ఆదాయ వర్గాల వారు ఈ యాప్ లు హాని కలిగిస్తాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రుణా యాప్స్ వారు అధిక వడ్డీ రేట్లు, అదనపు ఛార్జీల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. రుణగ్రహీతలను బ్లాక్‌మెయిల్,వేధింపులకు గురి చేయడానికి వారి 
 కాంటాక్ట్‌లు, లొకేషన్‌లు, ఫోటోలు,వీడియోల వంటి రహస్య వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. 

చట్టవిరుద్ధమైన రుణాల యాప్‌లు అనుసరించిన కఠినమైన రికవరీ పద్ధతుల వల్ల భారతదేశం అంతటా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమస్య జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్, పౌరుల భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని హోం శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటెడ్ ఎంటిటీలు (RE) కాని ఈ అక్రమ రుణాల యాప్‌లు భారీ స్థాయిలో SMS, డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్‌లు మరియు మొబైల్ యాప్ స్టోర్‌లను ఉపయోగిస్తున్నాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

పునర్వినియోగపరచలేని ఇమెయిల్‌లు, వర్చువల్ నంబర్‌లు, మ్యూల్ ఖాతాలు, షెల్ కంపెనీలు, పేమెంట్ అగ్రిగేటర్లు, API సేవలు (ఖాతా ధ్రువీకరణ, డాక్యుమెంట్ వెరిఫికేషన్), క్లౌడ్ హోస్టింగ్, క్రిప్టోకరెన్సీ మొదలైన వాటిని ఉపయోగించి ఇది వ్యవస్థీకృత సైబర్ క్రైమ్ అని దర్యాప్తు తర్వాత కనుగొనబడినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. లోన్ యాప్ అనాలిసిస్, మాల్వేర్ విశ్లేషణ, సాంకేతిక సహాయం కోసం చట్ట అమలు సంస్థలు నేషనల్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (NCFL) సేవలను పొందవచ్చని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.  

ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు,UTలు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ,అంతేకాకుండా, ఇటువంటి యాప్‌లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలకు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 

click me!