నిర్లక్ష్యం: చిన్నారి వేలుకి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేసిన వైద్యుడు

By Rajesh Karampoori  |  First Published May 17, 2024, 11:59 AM IST

ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ డాక్టర్ చిన్నారి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే? 


మనకు ఏదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తాం. వైద్యులనే దేవుళ్లుగా భావించి చేతులెత్తి మొక్కుతాం. అలాంటి డాక్టర్లు కొన్నిసార్లు చేసే పొరపాట్ల కారణంగా పేషెంట్ల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఎలాగంటారా వారు చేసే సర్జరీలో అప్పుడప్పుడూ పొరపాట్లు చేస్తూ కడుపులో కత్తెరలు, బ్లేడ్లు, దారాలు లాంటివి మరిచిపోతూ ఉంటారు. అలాగే ఒక భాగానికి చేయాల్సిన సర్జరీని మరో భాగానికి చేస్తుంటారు. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ వైద్యుడి నిర్ల‌క్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. చిన్నారికి ఒక చోట చేయాల్సిన సర్జరీని మరో చోట చేయడంతో ఆ చిన్నారి గొంతు మూగబోయింది. మరి ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళలోని కోజికోడ్ ఆస్పత్రిలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఆ ఆసుపత్రిలో వైద్యం చేసే వైద్యులు ఓ బాలిక చేతి వేలికి కావాల్సిన స‌ర్జరీని నాలుక‌కు చేశారు. ఇలా చేయడంతో ఈ చిన్నారి గొంతు మూగబోయింది. ఆ విష‌యం చిన్నారి తల్లిదండ్రులకు తెలిసి ఒక్క‌సారిగా షాక్‌ అయ్యారు. అయితే ఆ చిన్నారి చేతివేలికి ఐదు వేళ్లు కాకుండా మరో వేలు ఉండడంతో చిన్నారి పేరెంట్స్ వైద్యుల‌ను సంప్ర‌దించారు. చిన్నారి చేతిని చూసిన వైద్యులు ఆరో వేలును సర్జరీ చేసి తీసేయొచ్చని వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు వారి కుమార్తెను కోజికోడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి వైద్యులు ఆ చిన్నారి చేతి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశారు. సర్జరీ పూర్తయ్యాక చిన్నారి చేతికి ఉండాల్సిన బ్యాండేజ్ నోటికి ఉండడంతో చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వైద్యులను, ఆసుప‌త్రి సిబ్బందిని చిన్నారి బంధువులు నిలదీయగా  నాలుకకు కూడా సమస్య ఉందని తెలిపారు. అందుకే అక్కడ సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పారు.  

Latest Videos

ఈ విష‌యం పై స్పందించిన కేర‌ళ ప్ర‌భుత్వం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బెజోన్‌ జాన్సన్‌ను సస్పెండ్‌ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందునే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని  కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి తెలిపారు. అలాగే ఈ సంఘటన పై దర్యాప్తు పూర్తిస్థాయిలో చేసేందుకు మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. మరోవైపు బాలిక త‌ల్లిదండ్రుల‌ు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ జాన్సన్‌పై కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఆ తర్వాత చిన్నారి తల్లిదండ్రులకు వైద్యులు క్షమాపణలు తెలిపి బాలిక చేతికి సర్జరీ చేస్తామని తెలిపారు. ఈ విష‌యం గురించి బాలికి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తె భవిష్యత్తు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పాడైందని వాపోతున్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆసుపత్రే బాధ్యత వహించాలంటున్నారు.

click me!