Swati Maliwal assault: ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ కు శుక్రవారం తెల్లవారుజాము వరకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు జరిగాయి. అంతకు ముందు ఆమె నుంచి పోలీసులు వాగ్మూలాన్ని సేకరించారు. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడిపై కేసు నమోదు చేశారు..
Swati Maliwal assault: దేశం మొత్తం ప్రస్తుతం స్వాతి మలివాల్ పేరు మారుమోగిపోతోంది. కొంత కాలం కిందటి వరకు ఆమె ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా సేవలందించారు. ఇటీవలే రాజ్యసభకు ఎంపికయ్యారు. అయినప్పటికీ ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే నిన్న జరిగిన ఒక ఘటన వల్ల ఆమె పేరు నేషనల్ మీడియాలోకి ఎక్కింది. ఇంతకీ ఏం జరిగిదంటే..
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ కు ఎన్నికైన స్వాతి మలివాల్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సన్నిహితురాలని పేరుంది. కానీ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు విభవ్ కుమార్ తనపై దాడి చేశాడని మలివాల్ ఆరోపించారు. సీఎం నివాసంలోనే ఈ దాడి జరిగిందని తెలిపారు. దీనిని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ కూడా అంగీకరించారు. దాడి నిజమే అని ఒప్పుకున్నారు. ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో ఆప్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మళ్లీ ఈ వివాదం తెరపైకి రావడంతో ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
undefined
స్వాతి మలివాల్ పై దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆమెను గురువారం రాత్రి 11 గంటలకు పోలీసులు వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. రాత్రి 3 గంటల వరకు ఆమెకు అక్కడే వైద్య పరీక్షలు జరిగాయి. ఈ సమయంలో అడిషనల్ డీజీపీ స్థాయి అధికారు కూడా ఆమెతో ఉన్నారు.
ఈ పరీక్షల వల్ల మలివాల్ కు దాడిలో జరిగిన గాయాలను గుర్తించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే అంతకు ముందే ఈ ఘటనకు సంబంధించిన స్టేట్ మెంట్ ను ఆమె నుంచి రికార్డ్ చేసిన పోలీసులు విభవ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. అతడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354, 506, 509, 323 నమోదు చేశారు.
ఈ ఘటన విషయంలో ఆమె ‘ఎక్స్’లో కూడా పోస్ట్ పెట్టారు. “ నాకు జరిగింది చాలా దారుణం. ఈ ఘటనపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాను. తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. చివరి రోజులు నాకు చాలా కష్టంగా గడిచాయి. నా కోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు. దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయి. స్వాతి మలివాల్ ముఖ్యం కాదు. దేశ సమస్యలే ముఖ్యం. ఈ ఘటనపై రాజకీయాలు చేయొద్దని బీజేపీ విన్నవిస్తున్నా’’ అని పేర్కొన్నారు.