భారత్-చైనా ఘర్షణపై రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమావేశం.. కీలక అంశాలపై ప్రకటన 

By Rajesh KarampooriFirst Published Dec 13, 2022, 11:05 AM IST
Highlights

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఆర్మీతో పాటు పలువురు అధికారులతో పాటు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్),విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, గిరిధర్ అరమనే కూడా హాజరుకానున్నారు. అనంతరం ఆయన దీనిపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరిలతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో త్రివిధ ఆర్మీ చీఫ్‌లు ఈ సంఘటన గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సమగ్ర సమాచారాన్ని అందజేయనున్నారు. అదే సమయంలో ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కూడా హాజరు కావచ్చు.

ఈ అంశంపై నేడు పార్లమెంట్‌లో దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ స్వల్పకాలిక చర్చకు 176 నిబంధన కింద రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. అలాగే, లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ వాయిదా తీర్మానం ఇచ్చారు.  ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు. సరిహద్దుల వద్ద చోటు చేసుకుంటున్న వివాదాలపై కేంద్రం ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అంతేగాక.. భారత్-చైనా సైనికుల ఘర్షణపై పార్లమెంటు ప్రాంగణం వద్ద ప్రతిపక్షాలు నిరసన తెలపనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 9న భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ 

సమాచారం ప్రకారం.. LAC వెంబడి డిసెంబర్ 9న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) తన బలగాలను మోహరించింది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. భారత ఆర్మీ సిబ్బంది చైనా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కోరగా.. వారి తదుపరి పురోగతిని గట్టిగా నిరోధించారు. ఆ తర్వాత జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరువైపులా సైనికులు గాయపడ్డారు. వాగ్వివాదం జరిగిన వెంటనే ఇరువర్గాలు తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. చైనా సైనికుల ఈ ఆకస్మిక దాడికి తగిన సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. భారత్ వైపు నుంచి 20 మంది సైనికులు గాయపడగా, గాయపడిన చైనా సైనికుల సంఖ్య రెండింతలు ఎక్కువ. 

ఈ సంఘటన తరువాత.. భారతీయ స్థానిక కమాండర్ చైనా వైపు కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన ఏర్పాట్ల ప్రకారం..  శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించే మార్గాలపై చర్చించారు. తవాంగ్‌లో ఎల్‌ఏసీలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ ఇరుపక్షాలు తమవేనని, ఇరు దేశాల సైనికులు ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ వివాదం 2006 నుంచి కొనసాగుతోంది.

click me!