ఖైదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. జైలులోనే భార్యలతో గడపవచ్చు.. కండీషన్స్ అప్లై

By Mahesh KFirst Published Sep 21, 2022, 6:29 PM IST
Highlights

పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు వారి భార్యలతో ఏకాంతంగా గడిపే అవకాశాన్ని ఇస్తున్నది. ఇందుకోసం జైలులోనే ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నది.
 

న్యూఢిల్లీ: ఒక నేరానికి శిక్ష ప్రాయాశ్చిత్తం పొందడమేనని కొందరు మేధావులు చెబుతుంటారు. కారాగారాలు అలాగే ఉండాలని, ప్రాయాశ్చిత్తపడిన వారు మళ్లీ అలాంటి నేరాలు చేయబోరని వివరిస్తుంటారు. కానీ, ఇది నిజజీవితంలో అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్కొక్కరి మనసు ఒకరిలా ఉంటుంది. నేర ప్రవృత్తి తీవ్రతలు వేరు. దొంగతనంపై జైలుకు వెళ్లి వచ్చి గజదొంగగా మారిన వారినీ చూస్తుంటాం. కాగా, కొందరేమో జైలులో తీవ్ర క్షోభకు గురై ఆత్మహత్యలకు ప్రయత్నించినవారూ ఉంటారు. జైలులో ఖైదీలు తీవ్ర మానసిక వేదనకు గురవుతారని ఓ సర్వే వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం వారు వారి భాగస్వాములతో దూరంగా ఉండటమే అని తెలుస్తున్నది. ఇందుకోసమే పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారికి తమ భార్యలతో కలిసి కాలాన్ని గడిపే అవకాశాన్ని పంజాబ్ ప్రభుత్వం ఖైదీలకు అందించనుంది. కారాగారంలో ఎక్కువ కాలం శిక్ష అనుభవిస్తున్న వారికి ఈ సౌకర్యం ముందుగా కల్పించనుంది. మూడు నెలలకు ఒకసారి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఎక్కువ కాలం జైలులో శిక్ష అనుభవించినవారికి ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. అంతేకాదు, ఆ ఖైదీలు తోటి ఖైదీలు, జైలు సిబ్బందితోనూ సత్ప్రవర్తన కలిగి ఉంటే మరింత ప్రయారిటీ ఇవ్వనున్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మూడు నెలలకు ఒకసారి వారి భార్యలతో గడిపే అవకాశాన్ని పంజాబ్ ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇందుకోసం వారికి జైలులోనే ప్రత్యేకంగా గదులు ఉంటాయి. అందులో దంపతులకు ప్రత్యేక వసతులు ఉంటాయి. సుమారు రెండు గంటల పాటు వారు తమ జీవిత భాగస్వాములతో ఏకాంతంగా సమయం గడపవచ్చు. కష్ట, సుఖాలను పంచుకోవచ్చు. దీని వల్ల ఖైదీల ప్రవర్తన మరింత మెరుగు పడుతుందని పంజాబ్ ప్రభుత్వం భావిస్తున్నది.

జీవిత భాగస్వాములతో విడివడి ఉండటం మూలంగా ఆ ఖైదీలు మానసికంగా కుంగిపోతారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే ఖైదీలకు ఇప్పటికే తమ బంధువులు, ఆప్తులతో ములాఖత్‌కు అవకాశం ఇస్తున్నారు.

అయితే, కఠిన నేరాలకు పాల్పడి శిక్ష అనుభవించే ఖైదీలకు ఈ అవకాశం ఉండదు. అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు వంటి తీవ్ర నేరాలు చేసిన వారికీ ఈ వెసులుబాటు ఉండదని అధికారులు స్పష్టంగా చేశారు. అదే విధంగా గ్యాంగ్‌స్టర్‌లు, తీవ్రవాదులు, ఉపా వంటి కఠిన చట్టాల కింద శిక్ష అనుభవిస్తున్నవారికీ ఈ అవకాశం ఉండదు. అయితే, వారికి ములాఖత్ సదుపాయం మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు.

ముందుగా గోయిందద్వాల్ సాహిబ్‌లోని సెంట్రల్ జైలు, నాబాలోని జిల్లా జైలు, భటిండాలోని మహిళా జైలులో దీన్ని అమలు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇలాంటి అవకాశాన్ని ఖైదీలకు తెచ్చిన తొలి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది.

click me!