ప్రయాగరాజ్ కుంభమేళాలో ప్రధాన ఆకర్షణగా దక్షిణాది ఆలయం ... దీని చరిత్ర తెలుసా?

By Arun Kumar PFirst Published Oct 24, 2024, 2:48 PM IST
Highlights

ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025 లో సంగమం ఒడ్డున ఉన్న దక్షిణ భారత శైలి ఆది శంకర విమాన మండపం భక్తులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే...

ప్రయాగరాజ్ : ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం కుంభమేళా ఉత్తర ప్రదేశ్ సిద్దమయ్యింది. ఇప్పటికే ప్రయాాగరాజ్ మహా కుంభమేళాకు సర్వం సిద్దం చేస్తోంది యోగి సర్కార్. ఈ కుంభమేళాలో త్రివేణి సంగమ తీరంలో దక్షిణభారత శైలిలో వెలిసిన ఆదిశంకర విమాన మండపం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయాన్ని తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. 

మహా కుంభమేళా కోసం ఆ ఆలయం చుట్టూ అభివృద్ది, సుందరీకరణ పనులు చేపడుతోంది యోగి సర్కార్. వీటిని యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. ఆలయంలోని దేవతా మూర్తులను దర్శించుకున్న ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వహకులతో మాట్లాడిన ఆయన కుంభమేళా సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

Latest Videos

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు రమణి శాస్త్రి మాట్లాడుతే...కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య స్వామి జయేంద్ర సరస్వతి తన గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి కోరిక మేరకు ఆది శంకర విమాన మండపాన్ని నిర్మించినట్లు తెలిపారు.

1934 లో చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రయాగలో చాతుర్మాస్య దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆయన దారాగంజ్ ఆశ్రమంలో ఉండి ప్రతిరోజూ సంగమంలో స్నానం చేసేవారని తెలిపారు. ఒకరోజు ఆయనకు రెండు రావి చెట్ల మధ్య ఖాళీ స్థలం కనిపించింది. ఆయన ధర్మ శాస్త్రాలను అధ్యయనం చేసి, తపస్సు ద్వారా ఆ ప్రదేశంలోనే ఆది శంకరాచార్యులు, కుమారిల భట్టుల మధ్య సంభాషణ జరిగిందని, అక్కడే కుమారిల భట్టు తుషాగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నారని నిరూపించారు. ఆ స్థలంలోనే ఆలయం నిర్మించాలని చంద్రశేఖరేంద్ర సరస్వతి కోరగా జయేంద్ర సరస్వతి ఆ కోరికను నెరవేర్చారని వివరించారు.

17 సంవత్సరాల నిర్మాణం

1969 లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి. గోపాల్ రెడ్డి ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఇంజనీర్లు బి. సోమసుందరం, సి.ఎస్. రామచంద్ర ఆలయ నమూనాను రూపొందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సేతు నిగమ్ కూడా నిర్మాణంలో సహకరించింది. 16 స్తంభాలపై ఆలయం నిర్మితమైంది. 17 మార్చి 1986 న ఆలయం ప్రారంభమైంది. ఆలయంలోని విగ్రహాలు, నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు దక్షిణ భారతదేశం నుండి తీసుకువచ్చారు. ఆలయం ద్రావిడ శైలికి ఉదాహరణ.

130 అడుగుల ఎత్తైన ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల విగ్రహం, దేవి కామాక్షి, 51 శక్తిపీఠాలు, తిరుపతి బాలాజీ, సహస్ర యోగ లింగంతో పాటు 108 శివలింగాలు, గణేష్ ఆలయం ఉన్నాయి. ఆలయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు... సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. ఆలయం పైఅంతస్తుల నుండి సంగమం అందమైన దృశ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. మహా కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారని ఆలయ నిర్వాహకుడు రమణి శాస్త్రి తెలిపారు. 

 

 

click me!