దేశంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా యూపీ : యోగి సర్కార్ లక్ష్యమిదేనట

By Arun Kumar PFirst Published Oct 24, 2024, 1:18 PM IST
Highlights

యూపీ జీడీపీ 2025 నాటికి రూ.32 లక్షల కోట్లకు చేరుకునేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నిస్తున్నారు. ఇంవులో భాాగంగానే మాఫియాపై కఠిన చర్యలు, పెట్టుబడుల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించారు.

లక్నో : రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అంటే మార్చి 2025 నాటికి రూ.32 లక్షల కోట్లకు చేరుకుంటుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తాజాగా రాజధాని లక్నోలోని తాజ్ హోటల్లో ఓ ప్రముఖ వార్తాపత్రిక నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో యూపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగానే యూపీ ఆర్థిక వృద్ది గురించి కామెంట్స్ చేసారు. అంతేకాదు రాష్ట్ర ఆర్థిక విజయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశ్రామిక అభివృద్ధి, మాఫియాపై తీసుకున్న కఠిన చర్యలపై ఆయన వివరంగా చర్చించారు.

గత ప్రభుత్వాలు ఒక జిల్లా ఒక మాఫియా విధానాన్ని అవలంబించేవి...కానీ తాము ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) ద్వారా ఉత్తరప్రదేశ్ బ్రాండింగ్ చేశామని ముఖ్యమంత్రి అన్నారు. మునుపటి ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర జీడీపీ రూ.12 లక్షల కోట్లు ఉండేదని, కానీ తమ ప్రభుత్వ ప్రయత్నాలతో 2023-24లో ఈ సంఖ్య రూ.26 లక్షల కోట్లకు చేరుకుందని అన్నారు. ఇప్పుడు రూ.32 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఆయన చెప్పారు.

Latest Videos

మాఫియాలపై ఉక్కు పాదం

రాష్ట్రంలో రౌడీ గ్యాంగులు, మాఫియా ముఠాలపై తీసుకున్న కఠిన చర్యలను సీఎం యోగి నొక్కి చెప్పారు. నేరస్థులను, మాఫియాలను తమ ప్రభుత్వం ఏమాత్రం సహించదని ఆయన అన్నారు. నేర ప్రవృత్తికి అలవాటుపడ్డవారు సాధారణ పౌరులతో ఎంత క్రూరంగా ప్రవర్తిస్తే తమ ప్రభుత్వం కూడా అంతే క్రూరంగా వారిపై చర్యలు తీసుకుంటుందని యోగి హెచ్చరించారు.

రాష్ట్రంలో యాంటీ భూ మాఫియా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని... దీని ద్వారా 64 వేల ఎకరాల భూమిని మాఫియా నుంచి విముక్తి చేశామని ఆయన తెలిపారు. మునుపటి ప్రభుత్వాలు మాఫియాకు సహాయం చేసేవని... కానీ ఇప్పుడు వారి భద్రతను తొలగించి రాష్ట్రాన్ని మాఫియా రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వ చర్యలవల్ల యూపీలో శాంతిభద్రతలు చాలా మెరుగయ్యాయని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 2017లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టుబడుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని అన్నారు. అందుకు రాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులే కారణమన్పారు. కానీ ఆ పరిస్థితిని తమ ప్రభుత్వం పూర్తిగా మార్చింది... దీంతో ఇప్పుడు యూపీలో పెట్టుబడులు కొత్తపుంతలు తొక్కుతున్నాయన్నారు.

ఇటీవల ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించింది... దీని ఫలితంగా రాష్ట్రానికి రూ.40 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని సీఎం యోగి తెలిపారు. గతంలో  అధికారులకు రూ.20 వేల కోట్ల పెట్టుబడి తేవడం కూడా గొప్ప విషయంగా అనిపించేది..., కానీ నేడు రూ.40 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు అందడంతో ఆశ్చర్యానికి గురయ్యారన్నారు.  ఈ పెట్టుబడుల వల్ల కోటిన్నర మంది యువతకు ఉపాధి లభిస్తుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

పోలీసులకు అత్యాధునిక సాంకేతికత

భద్రతా చర్యల గురించి సీఎం యోగి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పోలీసు దళంలో పెద్ద సంస్కరణలు తీసుకువచ్చిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 1.54 లక్షల మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు., పోలీసులకు అత్యాధునిక సాంకేతికతను అందించామని యోగి వెల్లడించారు. 

గతంలో రాష్ట్రంలో నేరస్థులు పోలీసుల సహాయంతోనే నేరాలు చేసేవారు... కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని సీఎం అన్నారు. యూపీ పోలీసులు ఇప్పుడు పూర్తిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని, నేరస్థుల్లో భయాన్ని కలిగిస్తున్నారని తెలిపారు.

తమ ప్రభుత్వం పోలీసు శిక్షణ వ్యవధిని పెంచిందని... 6 వేల మంది పోలీసు సిబ్బందికి ఒకేసారి శిక్షణ ఇచ్చామని సీఎం యోగి తెలిపారు. అంతేకాకుండా పోలీసు దళంలో పారా మిలిటరీ, మిలిటరీ కేంద్రాల నుంచి కూడా సహకారం తీసుకున్నామని... దీనివల్ల రాష్ట్ర భద్రతా ఏర్పాట్లు మెరుగుపడ్డాయని ఆయన అన్నారు.

దేశంలోనే అత్యుత్తమ హైవేలు యూపీలోనే

రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి చర్చిస్తూ... ఉత్తరప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక ఎక్స్‌ప్రెస్‌వేలు కలిగిన రాష్ట్రంగా అవతరించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గతంలో యూపీ రోడ్లను గుంతలమయంగా భావించేవారని, కానీ నేడు రాష్ట్ర రోడ్లు దేశంలోనే అత్యుత్తమ హైవేల జాబితాలో ఉన్నాయని ఆయన చెప్పారు.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తయిందని ఆయన తెలిపారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే పనులు జరుగుతున్నాయని, దీని ప్రధాన కారిడార్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని ఆయన అన్నారు. నేడు గోరఖ్‌పూర్-లింక్ ఎక్స్‌ప్రెస్‌వే సిద్ధంగా ఉందన్నారు.

దేశంలోనే తొలి 12-లేన్ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ-మేరట్‌లో ప్రారంభమైందని, ఆరు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. దేశంలోనే తొలి జలమార్గం వారణాసి-హల్దియా మధ్య ప్రారంభమైందని యోగి వెల్లడించారు.

వారణాసిలో అత్యధిక జీఐ ట్యాగ్‌లు

లాజిస్టిక్స్ కేంద్రంగా మారడానికి యూపీలో చేపడుతున్న చర్యల గురించి చర్చిస్తూ... వారణాసిలో లాజిస్టిక్ మల్టీమోడల్ టెర్మినల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గౌతమ్ బుద్ధ నగర్‌లో కూడా లాజిస్టిక్స్ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం యోగి అన్నారు. యూపీ 75 జిల్లాల్లో 75 జీఐ ట్యాగ్‌లను సాధించిందని, వీటిలో వారణాసి అగ్రస్థానంలో ఉందని ఆయన చెప్పారు.

వాణిజ్యం, ఎగుమతుల రంగంలో రాష్ట్ర విజయాలను కూడా సీఎం యోగి నొక్కి చెప్పారు. మురాదాబాద్ ఇప్పుడు రూ.16 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండగా, భదోహి కార్పెట్ పరిశ్రమ రూ.8 వేల కోట్ల ఎగుమతులు చేస్తోందని ఆయన తెలిపారు. ఫిరోజాబాద్ గాజు పరిశ్రమ, మేరట్ క్రీడా ఉత్పత్తుల పరిశ్రమలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇవి ఇప్పుడు దేశవిదేశాల్లో బ్రాండ్‌లుగా మారాయన్నారు.

వ్యాపారం రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో కీలకమైన భాగమని సీఎం యోగి అన్నారు. శ్రీమద్భగవద్గీతను ఉదాహరిస్తూ వ్యవసాయం, గోసంరక్షణ, వాణిజ్యం అన్నీ కలిసి నడుస్తాయని... వీటిని వేరు చేయలేమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పెద్ద పెట్టుబడులకు ఆధారమవుతాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ విశ్వకర్మ పథకం, ఓడీఓపీ పథకం పెద్ద పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి.

తన ప్రసంగం చివరలో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, రాబోయే కాలంలో ఇది దేశంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా దూసుకుపోతోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి ప్రస్థానం కొనసాగుతుందని, భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

click me!