ఈ దీపావళి వేడుకలను అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించేందుకు ప్లాన్ వేసింది యోగి సర్కార్. ఇందుకోసం ఏం చేయనున్నారంటే...
లక్నో : సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో అక్టోబర్ 28 నుండి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. అయోధ్యలో బాలరాముడు కొలువైన తర్వాత జరుగుతున్న మొదటి దీపావళి వేడుకలివి. దీంతో ఈసారి దీపోత్సవ వేడుకను చాలా గ్రాండ్ ప్లాన్ చేసింది యోగి సర్కార్. ఏకంగా 25 లక్షల దీపాలతో ఆద్యాత్మిక నగరం అయోధ్యలో వెలుగులు నింపనున్నారు.
ఈ దీపోత్సవం వేడుకల్లో భాగంగా భారీ ఊరేగింపు చేపట్టనున్నారు. సాకేత్ నుండి నాలుగు కిలో మీటర్ల వరకు కళాకారుల రామాయణ ఘట్టాల ప్రదర్శనతో ఊరేగింపు సాగనుంది. ఈసారి దీపోత్సవంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొంటారు.
undefined
యోగి ప్రభుత్వంలోని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ఈ దీపోత్సవ వేడుక గురించి మాట్లాడుతూ... సీఎం, ఇతర అతిథుల సమక్షంలో లక్ష్మణ్ కిలా ఘాట్ నుండి కొత్త ఘాట్ వరకు 1100 మంది వేద పండితులతో సరయు నది హారతి నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించనున్నట్లు తెలిపారు. రామ్ కి పైడీ వద్ద లక్షలాది దీపాల మధ్య సరయు నదిలో ఏర్పాటుచేసే వేదికపై కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. .
యోగి ప్రభుత్వం ఈ దీపావళి వేళ దీపోత్సవంతో పాటు వివిధ దేశాల సంస్కృతిని మన ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఆరు దేశాల కళాకారులు రామలీలను ప్రదర్శించనున్నారు.థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, నేపాల్ దేశాల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి ఐసీసీఆర్ సహకారం ఉంటుందని తెలిపారు..
అలాగే ఈ దీపోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్ తో పాటు 16 రాష్ట్రాల కళాకారులు పాల్గొంటారు. కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, చండీగఢ్, సిక్కిం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. గుప్తార్ ఘాట్, బడి దేవకాలి, తులసి ఉద్యానవనం, హనుమాన్ ఘాట్, రామ్ పాత్, రామకథ పార్క్, సరయు తీరం, రామ్ కి పైడీ వంటి ప్రదేశాల్లో దేశ, విదేశీ కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. డ్రోన్ షో, మ్యూజికల్ లేజర్ షోలు కూడా ఉంటాయి.