
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల తర్వాత నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ (New Year) వేడుకలు ఆయా స్థాయిల్లో జరుగుతుంటాయి. మన దేశంలోనూ ఈ వేడుకలు జరుగుతాయి. అయితే, ఒమిక్రాన్ (New Variant Omicron) కారణంగా ఈ ఏడాది వేడుకలు పరిమిత స్థాయిలోనే జరగనున్నాయి. కొత్త సంవత్సరం రోజున ఒకరికి ఇంకొకరు కానుకలు, గ్రీటింగ్స్, విషెస్ ఇచ్చి పుచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కూడా ఈ ఏడాది నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన నాడే రైతులకు గిఫ్ట్ ఇవ్వనున్నారు. జనవరి 1వ తేదీనే రైతుల కోసం పీఎం కిసాన్ నిధులను (PM Kisan Scheme Funds) విడుదల చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్‌లో పీఎం కిసాన్ స్కీమ్ కింద పదో విడత నిధులను వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన విడుదల చేస్తారు.
ఈ విడత కింద రూ. 20 వేల కోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. దీంతో పది కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ది పొందునున్నాయి. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ. 1.6 లక్షల కోట్లను రైతులకు విడుదల చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. జనవరి 1న పీఎం కిసాన్ నిదులు విడుదల చేసే కార్యక్రమంలోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)లకూ ఈక్విటీలు విడుదల చేయనున్నారు. సుమారు 351 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లకు రూ. 14 కోట్ల నిధులను విడుదల చేస్తారు. ఈ ఆర్గనైజేషన్‌ల ద్వారా 1.24 లక్షల రైతులు లబ్ది పొందనున్నారు. అదే కార్యక్రమంలో ఎఫ్‌పీవోలతో సంభాషిస్తారు. జాతిని ఉద్దేశించీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా హాజరు కానున్నారు.
Also Read: రైతులు ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రావు
రైతులందరూ ఈ - కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పేర్కొంది. ఇది పూర్తి చేసుకుంటేనే రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తామని తెలిపింది.
చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రతి యేటా మూడు దఫాల్లో రూ. 2000 చొప్పున మొత్తం రూ. 6000వేలను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకే పథకాన్ని ప్రకటించినా ఆసాములకూ విస్తరింపజేసింది. ప్రభుత్వోద్యోగులు, రూ. 10వేల పింఛన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు సహా పలువురిని పథకం నుంచి మినహాయించింది. పీఎం కిసాన్‌తోపాటు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా నేరుగా రైతులకు నగదును బదిలీ చేస్తున్నది.
Also Read: పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
ఇలా చెక్ చేసుకోవచ్చు..
ఈ పథకం కింద ఖాతాలో జమ అయిన మొత్తాలను పీఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. లబ్దిదారులు తమ పేరును ఎంటర్ చేసి నిధులు జమ అయ్యాయో లేదో కనుక్కోవచ్చు. ఏమైనా అవాంతరాలు, సమస్యలుంటే హాట్‌లైన్ నెంబర్లనూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.