
Narendra Modi Mohan Bhagwath Meeting : కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలు మరింత పెరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాంలో అమాయక టూరిస్ట్ లపై కాల్పుల ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఉగ్రవాద దాడి వెనక పాకిస్థాన్ హస్తముందని బలంగా నమ్ముతున్న కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ఉగ్రవాదుల ఏరివేతలో భారత ఆర్మీకి పూర్తి స్వేచ్చ ఇచ్చింది మోదీ సర్కార్.
అయితే ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో సమావేశమయ్యారు. పహల్గాం దాడి తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తో భారత్ ఇకపై ఎలా వ్యవహరించాలి? ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి? వంటి అంశాలపై ప్రధాని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వెంటనే ప్రధాని, ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీకావడంతో అసలు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
త్రివిధ దళాధిపతుల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉగ్రవాదంపై ఇక పోరాటం ముమ్మరం చేస్తామని... ఈ పోరులో సైన్యానికి పూర్తికి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. అంటే ఉగ్రవాదుల ఏరివేతకు ఇకపై భారత ఆర్మీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ తో వివాదం నేపథ్యంలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో ప్రధాని మోదీ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఉగ్రవాదంపై పోరుకే కాదు మిగతా భద్రతా వ్యవహారాల్లోనే సైన్యమే కీలకంగా వ్యవహరిస్తుందని.... తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు. ఎవరికి ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యానికే బాగా తెలుసు... అందుకే వారే నిర్ణయం కూడా వారిచేతిలోనే పెట్టినట్లు ప్రధాని వ్యాఖ్యానించారు.
భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉంది... తప్పకుండా ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రధాని అన్నారు. పహల్గామ్ దాడికి దీటైన జవాబు ఇస్తామన్నారు. ప్రధాని మాటలను బట్టి ఇకపై ఉగ్రవాదంపై సైన్యం ఎలా వ్యవహరిస్తుందో స్పష్టంగా తెలుస్తోంది.