మోదీ ప్రధాని అయ్యాక, తనను కలిసే వరకు చెప్పులు వేసుకోనని 14 ఏళ్ల కిందట రాంపాల్ కశ్యప్ మొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ రాంపాల్ కశ్యప్ ను తొలిసారి కలిశారు. ఈ సందర్భంగా మోదీ నేరుగా రాంపాల్ కు షూలను ధరించమని అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హర్యానాలో సోమవారం నాడు ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. 14 ఏళ్లుగా నరేంద్ర మోదీని (PM Modi) కలవడానికి చెప్పులు లేకుండా నడిచిన కైతల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ (Rampal Kashyap) జీవితంలో ఎంతో సంతోషించాడు. ప్రధాని మోదీ ఆయన్ని కలవడమే కాకుండా స్వయంగా తన చేతులతో చెప్పులు తొడిగారు. ఈ ఎమోషనల్ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హర్యానాలోని కైతల్ జిల్లాకు చెందిన రాంపాల్ కశ్యప్ 2009లో ఒక ప్రతిజ్ఞ చేశారు. నరేంద్ర మోదీ లాంటి నాయకులే దేశ భవిష్యత్తును మారుస్తారని ఆయన నమ్మారు. మోదీ గారు దేశానికి ప్రధాని అయి, తను స్వయంగా కలిసే వరకు చెప్పులు వేసుకోకూడదని అదే సంవత్సరం నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిజ్ఞతో రాంపాల్ కశ్యప్ 14 ఏళ్లుగా ఎండా, వాన, చలి అని తేడా లేకుండా చెప్పులు లేకుండానే నడిచారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ప్రధాని మోదీ హర్యానా పర్యటనలో రాంపాల్ కశ్యప్‌ను వేదిక మీదకు పిలిచారు. దేశంలోని మీడియా, ప్రజల సమక్షంలో మోదీ స్వయంగా ఆయనకు చెప్పులు తొడిగారు. ఆ సమయంలో వేదికపై ఉన్న వాళ్లంతా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ కూడా ఎంతో ఎమోషనల్‌గా కనిపించారు. రాంపాల్ కశ్యప్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
రాంపాల్ గారి సంకల్పం కేవలం నా ఒక్కడి కోసమే కాదు, దేశాన్ని కొత్త దిశలో నడిపించాలనుకునే ప్రజలందరి నమ్మకం అని మోదీ అన్నారు. 14 ఏళ్లు చెప్పులు లేకుండా నడవడం అంటే చిన్న విషయం కాదు, ఇది త్యాగానికి, తిరుగులేని నమ్మకానికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు.