ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పై ఫైర అయ్యారు. హర్యానాలోని హిసార్‌లో జరిగిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ని మోదీ తీవ్రంగా విమర్శించారు. ముస్లింల మీద నిజంగా శ్రద్ధ ఉంటే కాంగ్రెస్ వాళ్ళని అధ్యక్షుడిగా ఎందుకు చేయకూడదని మోదీ సవాల్ విసిరారు. మోదీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
PM Modi challenges Congress: ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉంటే ముస్లిం నేతను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించాలని మోదీ అన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల్ని ఆయన తప్పుబట్టారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన మోదీ, హర్యానాలోని హిసార్‌లో జరిగిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ని మోదీ తీవ్రంగా విమర్శించారు. కనీసం ఒక ముస్లింనైనా అధ్యక్షుడిగా చేయగలరా అని సవాల్ విసిరారు.
కాంగ్రెస్‌ను దుయ్యబట్టిన మోదీ
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించినందుకు కాంగ్రెస్‌ను ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లిం మత ఛాందసవాదులను బుజ్జగిస్తూ వస్తోంది. కొత్త చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న నిరసనలే దీనికి నిదర్శనం అన్నారు. ''ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే, ఎందుకు ఒక ముస్లింని పార్టీ అధ్యక్షుడిగా చేయకూడదు? ఎన్నికల్లో ముస్లింలకు 50 శాతం సీట్లు ఇవ్వండి" అని మోదీ అన్నారు.
వక్ఫ్ చట్టం గురించి మోదీ
కాంగ్రెస్ కొందరు ఛాందసవాదులనే సంతోషపెట్టింది. మిగతా సమాజం మాత్రం పేదలుగా, చదువులేని వాళ్ళుగా ఉండిపోయింది. సవరించిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ దుర్మార్గపు విధానానికి నిదర్శనం అని మోదీ అన్నారు. సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం, భారతదేశంలో ఎక్కడా గిరిజన జాతుల భూమిలో వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోలేదు అని ఆయన అన్నారు.
ఇదే నిజమైన సామాజిక న్యాయం: మోదీ
కొత్త రూల్స్ వక్ఫ్ పవిత్రతను కాపాడతాయి. ముస్లిం సమాజంలోని పేద, బడుగు కుటుంబాలు, మహిళలు, ముఖ్యంగా వితంతువులు, పిల్లలకు వారి హక్కులు దక్కుతాయి. వారి హక్కులు కూడా రక్షించబడతాయి. ఇదే నిజమైన సామాజిక న్యాయం అని మోదీ అన్నారు.
రాజ్యాంగాన్ని అధికారం కోసం వాడుకున్న కాంగ్రెస్
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అధికారం కోసం వాడుకుంది అని మోదీ ఆరోపించారు. అధికారం చేజారిపోతుందని అనిపించినప్పుడల్లా ఎమర్జెన్సీ సమయంలో చేసినట్టు రాజ్యాంగాన్ని తొక్కేసింది అని మోదీ విమర్శించారు.