Mehul choksi: రూ. 1300 కోట్ల కుంభకోణంలో నిందితుడి అరెస్ట్‌.. భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు

Published : Apr 14, 2025, 04:39 PM IST
Mehul choksi: రూ. 1300 కోట్ల కుంభకోణంలో నిందితుడి అరెస్ట్‌.. భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు

సారాంశం

రూ.13,000 కోట్ల పీఎన్‌బీ బ్యాంక్ రుణ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మెహుల్ చోక్సీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 2025 ఏప్రిల్ 12, శనివారం నాడు మెహుల్ చోక్సీని అరెస్టు చేశారు. ప్రస్తుతం న్యాయపరమైన ప్రక్రియల కోసం అతడు కస్టడీలో ఉన్నాడు. అతనికి తన న్యాయవాదిని కలుసుకునే హక్కు ఇచ్చారు. చోక్సీ అప్పగింతకు భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా అభ్యర్థన అందిందిదని అని బెల్జియన్ న్యాయశాఖ ప్రకటించింది.  

65 ఏళ్ల మెహుల్ చోక్సీని ఏప్రిల్ 12, శనివారం నాడు బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను భారత్‌కు అప్పగించాలంటూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బెల్జియం ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. 2018లో భారత్ నుంచి పారిపోయిన చోక్సీ అప్పటి నుంచి అంటిగ్వాలో ఉండిపోయాడు. ఇటీవల వైద్య చికిత్స కోసం బెల్జియానికి వచ్చినట్టు సమాచారం, అక్కడే ఆయనను గుర్తించి అరెస్ట్ చేశారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో మెహుల్ చోక్సీ రెండో ప్రధాన నిందితుడు. మొదటి నిందితుడు అతని మేనమామ నిరవ్ మోదీ, ఆయన ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు. నిరవ్‌ మోదీ కూడా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 

ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్‌ను కొంతకాలం క్రితమే తొలగించినప్పటికీ, భారత సంస్థలు చోక్సీను భారత్‌కు రప్పించేందుకు కృషి చేస్తూనే ఉన్నాయి. 2018, 2021లో ముంబయిలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన రెండు అరెస్ట్ వారంట్లను బెల్జియం అధికారులకు అందించారు. ప్రస్తుతం చోక్సీకి సంబంధించి అధికారిక అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. ఆరోగ్య కారణాలపై ఆయన బెయిల్ కోరే అవకాశం ఉంది. చోక్సీ ప్రస్తుతం బెల్జియం జైలులోనే ఉన్నారని, ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ తెలిపారు.

"ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. బెల్జియంలో బెయిల్ కోసం దరఖాస్తు చేయడం కాకుండా, అప్పీల్ ఫైల్ చేయాలి. అప్పీల్ ప్రక్రియలోనే కస్టడీలో ఉంచకుండా ఆయనకు తనను తాను రక్షించుకునే అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తాం" అని అగర్వాల్ చెప్పారు. ఇది రాజకీయ ప్రేరణతో కూడిన కేసుగా ప్రస్తావిస్తామని చెప్పారు. 

చోక్సీ, అతడి కంపెనీ గితాంజలి జెమ్స్, నిరవ్ మోదీ, వీరి సహచరులు, పీఎన్‌బీకి చెందిన కొంతమంది అధికారులు ఈ కుంభకోణంలో భాగమని సీబీఐ, ఈడీ 2018లో కేసులు నమోదు చేశాయి. ఇందులో అసలు లావాదేవీలను చూపించేందుకు ఫేక్ లెటర్లు జారీ చేయడం ద్వారా భారీ నష్టం జరిగింది. ఈ కేసులో సీబీఐ చోక్సీపై రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఈడీ మూడు ప్రాసిక్యూషన్ కంప్లైంట్లు దాఖలు చేసింది.

చోక్సీ అరెస్ట్‌ కీలక పరిణామం: 

భారత న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోమవారం మాట్లాడుతూ, మెహుల్ చోక్సీ అరెస్ట్‌ భారత విదేశాంగ నైపుణ్యంలో ఒక విజయమని పేర్కొన్నారు. "మన విదేశాంగ మంత్రి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. నేను కూడా అదే చెబుతాను. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన విజయవంతమైన డిప్లొమసీ (దౌత్య వ్యూహం) ఫలితమే ఇది. అలాంటి విదేశాంగ వ్యూహాల వల్లే ఈ అప్పగింత వంటి పనులు సాధ్యమవుతున్నాయి. ఇది మన దేశానికి గర్వకారణమైన విషయం" అని మేఘవాల్ డా. బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించే కార్యక్రమంలో అన్నారు. 

చోక్సీ అరెస్ట్‌పై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ కూడా స్పందించారు. "ఇది చాలా పెద్ద విజయం" అని అన్నారు. "ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చెప్పారు  ప్రజల డబ్బు దోచిన వాళ్లు దాన్ని తిరిగి ఇవ్వాల్సిందే. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మెహుల్ చోక్సీ అరెస్ట్ అయ్యాడు. ఇది నిజంగా ఒక పెద్ద విజయం" అని చౌధరీ వ్యాఖ్యానించారు.

ఇక చోక్సీ తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, "చోక్సీని భారత్‌కు అప్పగిస్తే అతడి మానవ హక్కులు తీవ్రంగా ప్రభావితమవుతాయి" అన్నారు. "ఆయన మానవ హక్కులు చాలా తీవ్రంగా దెబ్బతింటాయి," అని అగర్వాల్ చెప్పారు. "ఇది ఒక న్యాయ ప్రక్రియ. మేము ఈ అప్పగింతకు రెండు కారణాల ఆధారంగా వ్యతిరేకంగా వాదిస్తాం మొదటిది, ఇది ఒక రాజకీయ ప్రేరణతో కూడిన కేసు. రెండవది, భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితి సరిగా లేదు అనే విషయాన్ని మేము ప్రస్తావిస్తాం" అని ఆయన అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం