ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషన్లు.. అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం

By Rajesh KarampooriFirst Published Nov 14, 2022, 3:02 PM IST
Highlights

 ప్రార్థనా స్థలాల చట్టం 1991 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రతిస్పందనగా అఫిడవిట్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు సోమవారం కేంద్రానికి మరింత సమయం ఇచ్చింది. ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసిన రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తన పిటిషన్‌లో చట్టాన్ని రద్దు చేయాలని కోరలేదని కోర్టుకు తెలియజేశారు. 
 

ప్రార్థనా స్థలాల చట్టం 1991పై విచారణ: ప్రార్థనా స్థలాల చట్టం 1991 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లపై ప్రతిస్పందనగా అఫిడవిట్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు సోమవారం కేంద్రానికి మరింత సమయం ఇచ్చింది. జనవరి మొదటి వారంలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. 
 
ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసిన రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ.. తాను మొత్తం చట్టాన్ని సవాలు చేయలేదని, చట్టాన్ని రద్దు చేయాలని కోరలేదని కోర్టుకు తెలియజేశారు. అయోధ్య రామ మందిర వివాదం మాదిరిగానే, కాశీ, మధురలోని వివాదాస్పద స్థలాలకు సంబంధించిన విషయాలను ప్రార్ధనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991 పరిధిలోకి రాకుండా ఉంచుమని ఆయన అన్నారు. దీనిపై తదుపరి విచారణలో స్వామి పిటిషన్‌ను అందరితో విచారించాలా? లేక మిగిలిన కేసుల నుంచి వేరు చేయాలా? అనే అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. 

ప్రార్థనా స్థలాల చట్టం 1991కి సంబంధించిన వివాదంపై అక్టోబర్ 12న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ రిటైర్డ్ ఆర్మీ అధికారి అనిల్ కబోత్రా, న్యాయవాది చంద్రశేఖర్, దేవకినందన్ ఠాకూర్, స్వామి జితేంద్రానంద్ సరస్వతి, రుద్ర విక్రమ్ సింగ్, బీజేపీ మాజీ ఎంపీ చింతామణి మాళవ్య దాఖలు చేశారు.
 
ఏడాదిన్నరగా కేంద్రం స్పందించలేదు

పిటిషనర్ అనిల్ కబోత్రా కూడా ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని సెక్షన్ 2,3, 4 రాజ్యాంగబద్ధతను సవాలు చేశారు.ఈ సెక్షన్లు సెక్యులరిజం సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ.. మార్చి 12,2021న కేంద్రానికి నోటీసు జారీ చేసింది. అయితే సుమారు ఒకటిన్నర సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వ సమాధానం కోర్టులో దాఖలు కాలేదు.  
 
ప్రార్థనా స్థలాల చట్టం 1991 అంటే ఏమిటి ?

ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం.. 1947 ఆగస్టు 15 నాటి మతపరమైన స్థలాల స్థితిలో ఏలాంటి మార్పు చేయరాదు. వాటిని అలాగే ఉంచుతారు. అయితే, అయోధ్యలోని రామ మందిరం కేసు దాని నుండి దూరంగా ఉంచబడింది. స్వాతంత్య్రానికి ముందు అయోధ్య కేసు కోర్టులో నడుస్తోంది. కాబట్టి దాన్ని వదిలేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష విధించారు. శిక్ష లేదా జరిమానా కేసు ఆధారంగా నిర్ణయించబడుతుంది. 1991లో పీవీ నరసింహ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో మత ఉద్రిక్తతలను తొలగించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ చట్టం 1991లోనే అమల్లోకి వచ్చిన తర్వాత వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే నిర్వహించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మసీదు యాజమాన్యం ప్రార్థనా స్థలం చట్టాన్ని పేర్కొంటూ  పిటిషన్‌ను కొట్టివేయాలని డిమాండ్ చేసింది. 1993లో అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన విచారణను నిలిపివేసింది. అక్కడికక్కడే యథాతథ స్థితిని కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. 

click me!