బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై సుప్రీంకోర్టులో పిటిషన్.. ‘అది వీక్షించి అల్లర్లు చేసినవారిపై యాక్షన్ తీసుకోండి’

By Mahesh KFirst Published Jan 30, 2023, 12:57 PM IST
Highlights

గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై కేంద్రం విధించిన బ్యాన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు ఫైల్ అయ్యాయి. అసలు దేశంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పవర్‌ను ఉపయోగించవచ్చా? అనే రాజ్యాంగపరమైన ప్రశ్నను లేవనెత్తారు. డాక్యుమెంటరీ రెండు పార్టులనూ సుప్రీంకోర్టు వీక్షించి అల్లర్లలో ప్రమేయం ఉన్నవారిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు.
 

న్యూఢిల్లీ: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లు, ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తీరుపై బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ బీబీసీ తీసిన రెండు పార్టుల డాక్యుమెంటరీ సిరీస్‌ (ఇండియా: ది మోడీ కొశ్చన్) దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ డాక్యుసిరీస్ దుష్ప్రచారం చేసేదిగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. బీబీసీ డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని యూట్యూబ్, ట్విట్టర్‌లకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగించి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు బహిరంగం చేయలేదు. కానీ, కొన్ని వర్గాల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ బ్యాన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు నమోదు అయ్యాయి. వాటిని వచ్చే సోమవారం నుంచి విచారించనుంది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ, సీనియర్ అడ్వకేట్ సీయూ సింగ్‌లు ఫైల్ చేసిన పిటిషన్లను లిస్ట్ చేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని న్యాయమూర్తులు పీఎస్ నరసింహా, జేబీ పర్దివాలాల ధర్మాసనం తెలిపింది.

బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్‌ను వ్యతిరేకిస్తూ అడ్వకేట్ శర్మ పిల్‌తోపాటు ప్రముఖ జర్నలిస్టు ఎన్ రామ్; యాక్టివిస్ట్, లాయర్ ప్రశాంత్ భూషణ్; త్రిణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాల తరఫున అడ్వకేట్ సీయూ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.

అడ్వకేట్ శర్మ తన పిల్‌లో ఓ రాజ్యాంగపరమైన ప్రశ్నను లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద రాష్ట్రపతి ఎమర్జెన్సీని విధించనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రావిజన్స్‌ను ఉపయోగించవచ్చునా? అని ప్రశ్నించారు. ఆర్టికల్ 19(1)(2) కింద దేశ పౌరులు  గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వార్తలు, వాస్తవాలు, నివేదికలను చూసే హక్కును కలిగి ఉండరా? అనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించాలని కోరారు. బీబీసీ డాక్యుమెంటరీ రికార్డెడ్ ఫ్యాక్ట్స్ చెప్పిందని, ఇవి అల్లర్ల ఎవిడెన్స్ కూడా అని పేర్కొంటూ.. బాధితులకు న్యాయం చేకూర్చడానికి వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చు అని కూడా పేర్కొన్నారు.

Also Read: ముంబయి టిస్ కాలేజీలో బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్.. యాజమాన్యం హెచ్చరికలు బేఖాతరు

బీబీసీ రెండు పార్టుల డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం, నిర్హేతుకం, దుర్మార్గమైన చర్య అని అడ్వకేట్ శర్మ పిటిషన్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఈ రెండు పిటిషన్లను పరిశీలించి 2002 గుజరాత్ అల్లర్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగించి  ఐటీ రూల్స్ ఆధారంగా సోషల్ మీడియాలో లింక్‌లను తొలగించందని అడ్వకేట్ సీయూ సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్ రామ్, ప్రశాంత్ భూషణ్‌ల ట్వీట్లను తొలగించారని వివరించారు. బ్లాక్ చేసే ఆదేశాలను కేంద్రం బహిర్గతం చేయలేదని తెలిపారు. ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చేసినందుకు అజ్మీర్‌లోని కాలేజీ స్టూడెంట్లను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.

click me!