Bulli Bai: పశ్చాత్తాపం ఏం లేదు.. సరైన పనే చేశా.. యాప్ సృష్టికర్త వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Jan 7, 2022, 3:44 PM IST
Highlights

బుల్లి బాయ్ యాప్ డెవలప్ చేసిన నీరజ్ బిష్ణోయ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ యాప్ డెవలప్ చేసినందుకు తనలో బాధ ఏమీ లేదని చెప్పారు. అంతేకాదు, తనకు సరైనది అనే పనే తాను చేసినట్టు వివరించారు. బుల్లి బాయ్ యాప్‌ను ప్రచారం చేయడానికి ప్రత్యేకంగా ఓ ట్విట్టర్ అకౌంట్‌ను సృష్టించినట్టు తేలింది.

న్యూఢిల్లీ: ముస్లిం మహిళల(Muslim Women)ను లక్ష్యం చేసుకుని వారి ఫొటోలను మార్ఫింగ్(Distorted Photos) చేసి అసభ్యకర పదజాలంతో రాతలు రాస్తూ ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకోసం బుల్లి బాయ్ యాప్ తయారు చేశారు. ఈ యాప్‌ను అసోంకు చెందిన నీరజ్ బిష్ణోయ్ క్రియేట్ చేశారు. నిన్న ఆయనను ఢిల్లీ పోలీసులు.. అసోంలో అరెస్టు చేశారు. అరెస్టు చేసిన రోజు కోర్టులో హాజరు పరిచారు. ఏడు రోజుల పోలీసుల కస్టడీకి కోర్టు ఆదేశించింది. పోలీసులు నీరజ్ బిష్ణోయ్‌ను విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను చేసిన పనికి నీరజ్ బిష్ణోయ్‌లో పశ్చాత్తాపం లేదని అన్నారు. బుల్లి బాయ్ యాప్ క్రియేట్ చేసినందుకు తనలో పశ్చాత్తాపం ఏమీ లేదని వివరించారు. అంతేకాదు, తనకు సరైన పని అనిపించింది.. అదే పని చేశానని పోలీసులకు తెలిపినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

నీరజ్ బిష్ణోయ్ 21ఏళ్ల బీటెక్ స్టూడెంట్. భోపాల్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఢిల్లీ పోలీసులు నిన్న అసోంలోని జోర్హాట్ జిల్లాలో అరెస్టు చేశారు. ఈ యాప్ చేయడానికి ఉపయోగించిన డివైజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్విట్టర్ హ్యాండిల్ బుల్లి బాయ్ ఉపయోగించి డిజిటల్ సర్వెలేన్స్ ద్వారా అసోంలోని బిష్ణోయ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆ ట్విట్టర్ హ్యాండిల్‌ను ఇప్పుడు సస్పెండ్ చేశారు. విచారణలో బుల్లి బాయ్ యాప్‌ను నవంబర్‌లోనే డెవలప్ చేసినట్టు తేలింది. డిసెంబర్ 31వ తేదీన పబ్లిక్‌లోకి వెళ్లింది. ఈ యాప్ గురించి మరో ట్విట్టర్ హ్యాండిల్ రూపొందించారు. కాగా, ముంబయి పోలీసులను దూషించడానికి మరో ట్విట్టర్ హ్యాండిల్‌ను క్రియేట్ చేశారు.

బుల్లి బాయ్ యాప్ కేసు కింద ముగ్గురిని అరెస్టు చేసిన తర్వాతే ఈ అకౌంట్ క్రియేట్ చేసి ముంబయి పోలీసులను దూషించారు. ‘స్లంబయ్ పోలీసులు.. మీరు రాంగ్ పర్సన్స్‌ను అరెస్టు చేశారు. బుల్లి బాయ్ యాప్‌ను నేనే క్రియేట్ చేశాను. మీరు అరెస్టు చేసిన ఆ ఇద్దరు అమాయకులే. వారు ఇందులో ఏమీ చేయలేదు. వారిని వీలైనంత తొందరగా విడుదల చేయండి’ అని ఆ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఈ యాప్ వెనుక మాస్టర్ మైండ్‌గా పేర్కొన్న శ్వేత సింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత రోజు బుధవారం ఉదయం 10.42 గంటల ప్రాంతంలో ఈ ట్వీట్ పోస్టు అయింది.

 చాలా మంది ముస్లిం యువతులు, మహిళల ఫొటోలను వారి సమ్మతి లేకుండా బుల్లి బాయ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో వేలం వేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేపాయి. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఈ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చింది. చాలా మంది ముస్లిం మహిళలలు తమ పేర్లు ఆ ఆక్షన్ లిస్టులో ఉన్నట్టు కనుగొనడంతో ఈ ఉదంతం జనవరి 1న వెలుగులోకి వచ్చింది.

హిందు మహిళలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఫేస్‌బుక్ పేజీలు(Facebook Pages), టెలిగ్రామ్(Telegram Channel) యాప్‌లో చానెళ్లు ఉన్నట్టు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఫేస్‌బుక్ పేజీలు, టెలిగ్రామ్ చానెళ్లు హిందు మహిళల ఫొటోలను షేర్ చేస్తున్నాయని, వారిపై వేధింపులకు పాల్పడుతున్నాయని యూట్యూబర్ అన్షుల్ సక్సేనా ఆరోపణలు చేశారు. జూన్ 2021లో ఆ టెలిగ్రామ్ చానెల్‌ను సృష్టించినట్టు తెలిపారు.

click me!