నిర్భయ కేసులో మరో ట్విస్ట్: పోలీసులపై కోర్టుకెక్కిన దోషి పవన్ గుప్తా

By telugu teamFirst Published Mar 11, 2020, 6:50 PM IST
Highlights

నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా మరో ట్విస్ట్ ఇచ్చాడు. తనపై దాడి చేసి తలపై గాయం చేసిన ఇద్దరు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అతను ఢిల్లీ కోర్టును కోరాడు. నలుగురు దోషులకు ఇటీవల కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది.

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన పవన్ గుప్తా మరో ట్విస్ట్ ఇచ్చాడు. మండోలీ జైలుకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పవన్ గుప్తా ఢిల్లీ కోర్టును కోరాడు.

ఇద్దరు పోలీసు అధికారులు తనను కస్టడీలో కొట్టారని, దానివల్ల తన తలకు తీవ్రమైన గాయమైందని అతను తన పిటిషన్ లో ఆరోపించాడు. దానిపై వివరణ ఇవ్వాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించినట్లు ఎన్ఎఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 

Also Read: నిర్భయ దోషుల మరో ఎత్తుగడ: ఢిల్లీ లెఫ్టినెంట్‌‌ను ఆశ్రయించిన వినయ్ శర్మ

నిర్భయ కేసు దోషుల్లో మరొకడు వినయ్ శర్మ తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మెర్సీ పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. జైలులో తాను శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నట్లు అతను తెలిపాడు.

నిర్భయ కేసు దోషులు నలుగురిని మార్చి 20వ తేదీ ఉరి తీయాలని కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన నేపథ్యంలో వారిద్దరు ఆ కొత్త ఎత్తుగడలకు దిగారు. పవన్ కుమార్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మార్చి 4వ తేదీన తోసిపుచ్చారు. అంతకు ముందు మిగతా ముగ్గురు దోషుల మెర్సీ పిటిషన్లను కూడా తోసిపుచ్చారు. 

Also Read: ఇప్పటికే నాలుగు సార్లు చంపారు: నిర్భయ దోషులకు ఉరిశిక్షపై ఏపీ సింగ్

2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత ఆమె సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆరుగురు నిందితుల్లో ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మరొకతను జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. 

click me!