లాంఛనం పూర్తి: బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

By Siva KodatiFirst Published Mar 11, 2020, 3:16 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమై దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన గ్వాలియర్ రాజవంశీయుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమై దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన గ్వాలియర్ రాజవంశీయుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బుధవారం ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

మొదట ఈ రోజు ముందుగా 12.30 గంటలకే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలొచ్చినా చివరకు మధ్యాహ్నం 2.30కి ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.

Also Read:తండ్రి పుట్టినరోజు, నానమ్మ కోరిక తీర్చాడు: సింధియాపై వసుంధరా రాజే ప్రశంసలు

కొద్దిసేపు ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. సింధియాకు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

తండ్రి మాధవరావు సింధియా ఓ విమాన ప్రమాదంలో 2001లో కన్నుమూయడంతో జ్యోతిరాదిత్య సింధియా గుణ లోక్‌సభ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు.

అనంతరం జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్కడి నుంచి విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జ్యోతిరాదిత్య ఓడిపోయారు. అదే ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సింధియా కీలకపాత్ర పోషించారు.

Also Read:సింథియాకు బిజెపి ఆఫర్ ఇదే: మైనారిటీలో కమల్ నాథ్ ప్రభుత్వం

అయితే ఆయనను కాదని సీనియర్ నేత కమల్ నాథ్‌కు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో జ్యోతిరాదిత్య అసహనం వ్యక్తం చేశారు. నాటి నుంచి కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌తో విభేదాల కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 

click me!