ఒకప్పటిలా లేదు.. నా కలలన్నీ కల్లలయ్యాయి: కాంగ్రెస్‌పై సింధియా వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 11, 2020, 4:19 PM IST
Highlights

కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పటిలా లేదన్నారు జ్యోతిరాదిత్య సింధియా. బుధవారం జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సింధియా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా కొనసాగితే ప్రజాసేవ చేయలేననే ఉద్దేశ్యంతోనే తాను పార్టీ మారానని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు

కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పటిలా లేదన్నారు జ్యోతిరాదిత్య సింధియా. బుధవారం జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సింధియా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా కొనసాగితే ప్రజాసేవ చేయలేననే ఉద్దేశ్యంతోనే తాను పార్టీ మారానని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు.

ఇవాళ తాను జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రదాన్ లాంటి వ్యక్తులతో వేదిక పంచుకున్నానని.. బీజేపీలోకి తనను ఆహ్వానించిన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:లాంఛనం పూర్తి: బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

తన జీవితంలో రెండు తేదీలు ఎప్పటికీ మరచిపోలేనని... ఒకటి 2001 సెప్టెంబర్ 30న మా నాన్నను కోల్పోయానని ఆయన మరణం తన జీవిత స్వరూపాన్ని మార్చేసిందన్నారు. ఇక రెండోది 2020 మార్చి 10న జీవితంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నానని సింధియా స్పష్టం చేశారు.

అత్యంత కీలక నిర్ణయాన్ని కూడా మా నాన్న పుట్టినరోజున తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన అంతిమ లక్ష్యం ప్రజా సేవేనని, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ప్రజాసేవ చేసే అవకాశం లేక తాను ఎంతో వేదనకు గురయ్యానని సింధియా ఆవేదన వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం తాను కన్న కలలన్నీ గత ఏడాదిన్నరగా కల్లలయ్యానన్నారు. కమల్‌నాథ్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో అవినీతి, మాఫియా పెరిగిపోయిందని అందువల్లే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీపైనా, ఎన్డీఏ ప్రభుత్వంపైనా సింధియా ప్రశంసలు కురిపించారు.

Also Read:తండ్రి పుట్టినరోజు, నానమ్మ కోరిక తీర్చాడు: సింధియాపై వసుంధరా రాజే ప్రశంసలు

మోడీ చేతుల్లో దేశం భద్రంగా ఉందని తనకు మరోసారి ప్రజా సేవ చేసే అవకాశం కల్పించిన మోడీ, జేపీ నడ్డాలకు జ్యోతిరాదిత్య సింధియా కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమై దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన గ్వాలియర్ రాజవంశీయుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బుధవారం ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మొదట ఈ రోజు ముందుగా 12.30 గంటలకే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలొచ్చినా చివరకు మధ్యాహ్నం 2.30కి ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.

కొద్దిసేపు ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. సింధియాకు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

click me!