చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు: చైనా-ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతపై రాజ్‌నాథ్ సింగ్

By narsimha lodeFirst Published Sep 15, 2020, 3:30 PM IST
Highlights

సరిహద్దుల్లో వివాదంపై చైనాతో సాగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 
 


న్యూఢిల్లీ: సరిహద్దుల్లో వివాదంపై చైనాతో సాగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 


చైనా- ఇండియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించాలని లోక్ సభలో విపక్షాలు సభలో పట్టుబట్టాయి. అయితే చర్చకు ప్రభుత్వం విముఖత చూపింది. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారంనాడు పార్లమెంట్ లో ప్రకటన చేశారు.

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటన చేసింది.గాల్వాన్ లోయలో చైనా సైన్యానికి కల్నల్ సంతోష్ నేతృత్వంలో ఇండియన్ ఆర్మీ ధీటైన జవాబిచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు.ఈ ఘటనలో 20 మంది జవాన్లు అమరులయ్యారన్నారు.  వీర జవాన్ల వెన్నంటే దేశం మొత్తం ఉందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

భారత్ భూభాగంపై చైనా కావాలనే వివాదాలు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. ఎల్ఏసీ వద్ద భారత్‌కు చెందిన 90 వేల చదరపు అడుగుల భూమి చైనా ఆధీనంలో ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ భూమిని తనదని చైనా మొండిగా వాదిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.ఎల్ఏసీని సరిహద్దుగా చైనా గుర్తించడం లేదన్నారు. దీంతోనే వివాదం మరింత ముదిరిందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ విషయమై చర్చలు కొనసాగిస్తామని చైనా హామీ ఇచ్చినట్టుగా రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. సామరస్యపూర్వక చర్చలతోనే సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభిస్తోందని రాజ్‌నాథ్ సింగ్  చెప్పారు.

సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కమాండర్ల స్థాయిలో చర్చలు సాగుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఎల్ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు ప్రయత్నించినట్టుగా ఆయన చెప్పారు. అయితే చైనా బలగాలు ఎల్ఏసీ దాటి రాకుండా భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని ఆయన ప్రకటించారు.
భారత జవాన్ల సాహసానికి పార్లమెంట్ సెల్యూట్ చేస్తోందని ఆయన చెప్పారు.

ఎల్ఏసీ వద్ద చైనా భారీగా తన బలగాలను మోహరించిందని  రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. 

click me!