ఈసీగా అరుణ్ గోయాల్ ఫైల్ మెరుపు వేగంతో కదిలింది.. ఎందుకంత వేగం?: సుప్రీం కోర్టు సంచలన కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Nov 24, 2022, 12:54 PM IST
Highlights

అరుణ్ గోయెల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి సంబంధించిన ఫైల్‌ మెరుపు వేగంతో క్లియర్‌ అయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

అరుణ్ గోయెల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి సంబంధించిన ఫైల్‌ మెరుపు వేగంతో క్లియర్‌ అయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ ఫైల్ ఎందుకంత వేగంగా కదిలిందని ప్రశ్నించింది. మే 15న ఎన్నికల కమిషనర్‌ ఖాళీ ఏర్పడిందని.. కానీ ఇటీవల అరుణ్‌ గోయల్‌ ఫైల్‌ మెరుపు వేగంతో క్లియర్‌ అయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. 

జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తోంది.ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను కోర్టుకు సమర్పించాలని బుధవారం ఆదేశించింది. ఈ క్రమంలోనే గురువారం కేంద్రం అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఒరిజినల్ ఫైల్‌ను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచింది. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైలును చూసిన ధర్మాసనం.. ‘‘మే 15 నుంచి పోస్టు ఖాళీగా ఉంది. దీని తర్వాత అకస్మాత్తుగా 24 గంటల్లోపే పేర్లను పంపడం నుంచి ఆమోదం వరకు ప్రక్రియ పూర్తయింది. మే 15 మరియు నవంబర్ 18 మధ్య ఏమి జరిగింది?’’అని ప్రశ్నించింది. కేంద్ర మంత్రి పంపిన నలుగురి పేర్ల ప్రత్యేకత ఏంటని ప్రశ్నించింది. వారిలో అత్యంత జూనియర్ అధికారిని ఎందుకు, ఎలా ఎంపిక చేశారని అడిగింది. ‘‘ఇక్కడ ఎలాంటి మూల్యాంకనం జరిగిందనేదే ముఖ్యం.. అయినప్పటికీ మేము అరుణ్ గోయెల్ ప్రమాణపత్రాల మెరిట్‌లను ప్రశ్నించడం లేదు. కానీ నియామక ప్రక్రియ గురించే మాట్లాడుతున్నాం ’’ అని ధర్మాసనం పేర్కొంది.

దీనికి కేంద్రం తరపున అటార్నీ జనరల్ సమాధానమిచ్చారు. అటార్నీ జనరల్ మాట్లాడుతూ.. ‘‘ప్రక్రియలో ఏమీ తప్పు జరగలేదు. గతంలో కూడా అపాయింట్‌మెంట్ 12 నుంచి 24 గంటల్లో జరిగింది. ఈ 4 పేర్లు డీవోపీటీ డేటాబేస్ నుంచి తీసుకోబడ్డాయి. ఇది పబ్లిక్‌గా అందుబాటులో ఉంది.పేర్లు తీసుకునేటప్పుడు సీనియారిటీ, పదవీ విరమణ, వయస్సు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇది పూర్తి అమరికను కలిగి ఉంది. వయసుకు బదులు బ్యాచ్ ఆధారంగా సీనియారిటీని పరిగణిస్తారు’’అని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. కిందటి విచారణలో కేంద్రంలోని ఏ పాలక పక్షమైనా అధికారంలో చిరస్థాయిగా ఉండేందుకు ఇష్టపడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రస్తుత వ్యవస్థలో ఆ పదవిలో యస్ అంటూ తల ఊపే వ్యక్తిని నియమించవచ్చని పేర్కొంది. అయితే  1991 చట్టం ఎన్నికల కమిషన్‌కు భరోసా ఇస్తుందని కేంద్రం వాదించింది. దాని సభ్యులకు జీతం, పదవీకాల పరంగా స్వతంత్రంగా ఉంటుందని..  కోర్టు నుండి జోక్యాన్ని కోరే ట్రిగ్గర్ పాయింట్ లేదని తెలిపింది. ఇక, నవంబర్ 19న ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన అరుణ్ గోయల్ నవంబర్ 21న బాధ్యతలు స్వీకరించారు.

click me!