కోల్‌కతా దుర్గా పూజా వేడుకలకు యునెస్కో గుర్తింపు.. ప్రతి భారతీయుడికి గర్వకారణం: ప్రధాని

By Mahesh KFirst Published Dec 15, 2021, 8:22 PM IST
Highlights

కోల్‌కతా దుర్గా మాత పూజా వేడుకలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో సాంస్కృతిక జాబితాలో ఈ వేడుకలను చేర్చినట్టు యునెస్కో ఓ ప్రకటనలో వెల్లడించింది. మతం, కళల మేళవింపుగా ప్రజలు ఆనందించే వేడుకలుగా వీటిని యునెస్కో పేర్కొంది. ఈ వేడుకలకు ఆర్టిస్టులు, డిజైనర్లకూ ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని వివరించింది. ఈ గుర్తింపుపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం ఇది అని ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ: Kolkataలో ప్రతియేటా దసరా సందర్భంగా జరిగే శరన్నవరాత్రుల వేడుకలకు దేశవ్యాప్తంగా పేరుంది. దుర్గా దేవి(Durga) శరన్నవరాత్రులు ముఖ్యంగా కోల్‌కతాలో కన్నుల పండువగా జరుగుతాయి. ఈ వేడుకలకు తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఏకంగా UNESCO ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలోకి కోల్‌కతా దుర్గా పూజా వేడుకలు ఎక్కాయి. యునెస్కో ఇంటర్‌గవర్నమెంటల్ 16వ వార్షిక సదస్సులో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగింది. ఈ సదస్సులో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలోకి దుర్గా దేవి పూజలను చేర్చారు.

దుర్గా దేవి పూజలకు అంతర్జాతీయ గుర్తింపు రావడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం అని, ప్రతి ఒక్కరు ఆనందపడవలసిన విషయం అని పేర్కొన్నారు. దుర్గా పూజా భారత సాంప్రదాయాలను చక్కగా వెల్లడిస్తుంది అని వివరించారు. కోల్‌కతా దుర్గా పూజాలను ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఆస్వాదించాల్సిందేనని ట్వీట్ చేశారు. యునైటెడ్ నేషన్స్ విద్య, శాస్త్ర, సాంస్కృతిక(యునెస్కో) జాబితాలో దుర్గా పూజలను చేర్చినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read: రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం.. ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు

మతం, కళను మేళవించే ప్రజలు ఆనందించే ఒక ఉత్తమమైన సందర్భాలుగా ఈ వేడుకలు నిలుస్తున్నాయని యునెస్కో పేర్కొంది. ఆర్టిస్టులకు, డిజైనర్లకు ఈ వేడుకలు ఒక వేదికగా మారుతున్నాయని తెలిపింది.

ప్రసిద్ధ నిర్మాణాలు, పురాతన కట్టడాలకు యునెస్కో ఇచ్చే వారస్తవ సంపద గుర్తింపు, ‘ఇంటాంజిబుల్’ గుర్తింపు వేరు. ఈ సాంస్కృతిక జాబితాలో ఎప్పటికప్పుడు ప్రతియేటా కొత్త అంశాలు వచ్చి చేరుతుంటూనే ఉంటాయి. 2017లో మనదేశంలో జరుపుకునే కుంభమేళాకు ఈ గుర్తింపు లభించింది. అంతకు ముందటి సంవత్సరంలో యోగాను యునెస్కో ఈ జాబితాలో చేర్చింది. అంతకు ముందూ మన దేశానికి చెందిన పలు అంశాలు ఈ జాబితాలో చేరుతూ వచ్చాయి.

ఈ ఏడాది కోల్‌కతాలోని దుర్గా పూజాతో పాటు వెనిజులాలోని సెయింట్ జాన్ వేడుకలు, పనామాలో జరుపుకునే కార్పస్ క్రిస్టీ ఫెస్టివల్, బొలీవియాలో నిర్వహించుకునే తారిజా వేడకలూ తాజాగా ప్రకటించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చేరాయి. వీటితోపాటు దక్షిణ థాయిలాండ్‌లోని అక్రోబాటటిక్ డాన్స్ ఫామ్ ‘నోరా’, సిరియాలోని అలెప్పోలో కనిపించే ఒక సాంస్కృతిక సంప్రదాయ సంగీతం అల్ హలాబియా, కాంగో వాసుల రుంబా, వియత్నాంలోని జో అనే ఓ విధమైన నృత్యం కూడా తాజా సాంస్కృతిక జాబితాలో చేరాయి. సెనెగల్ దేశానికి చెందిన కలినరీ ఆర్ట్ రీతులు సీబు జెన్, ఈక్వెడార్‌లో కనిపించే పాస్సిలో అనే మ్యూజిక్, డ్యాన్స్ ఫామ్ కూడా ఈ జాబితాలో చేర్చారు.

Also Read: హరప్పా నాగరికతకు సజీవ సాక్ష్యం.. గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో గుర్తింపు

ఇటీవలే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. మనదేశం నుంచి 2020కి గాను రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.

click me!