మంగ‌ళ‌యాన్ ప్ర‌స్థానం ముగిసింది..సుదీర్ఘ పరిశోధనలకు తెర.. ఇస్రో అధికారిక ప్ర‌క‌ట‌న 

By Rajesh KarampooriFirst Published Oct 4, 2022, 12:05 AM IST
Highlights

ఎనిమిదేళ్ల పాటు సేవలందించిన భారత మొట్టమొదటి, ఏకైక అంగారక మిషన్  ‘మంగళయాన్‌’ ప్రస్థానం  ముగిసిందని ఇస్రో అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మిషన్‌లోని ఇంధనం, బ్యాటరీ నిండుకోవ‌డంతో  సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్టేనని పేర్కొంది. 

అంచనాలను మించి.. ఎనిమిదేళ్ల పాటు సేవలందించిన భారత మొట్టమొదటి, ఏకైక అంగారక మిషన్ ‘మంగళయాన్‌’ ప్రస్థానం ముగిసింద‌ని ఇస్రో అధికారికంగా ప్ర‌క‌టించింది. అంగారకుడిపైకి వెళ్లే వ్యోమనౌక కోలుకోలేదని, జీవిత చరమాంకానికి చేరుకుందని, ఈ మిషన్‌లోని  ఇంధనం, బ్యాటరీ స్థాయిలు నిర్దేశిత పరిమితి కన్నా దిగువకు చేరడంతో సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్టేనని ప్ర‌క‌టించింది. గ్రహాల అన్వేషణ చరిత్రలో ఈ మిషన్ ఒక అద్భుతమైన సాంకేతిక, శాస్త్రీయ విజయం సాధించింద‌ని ఇస్రో  పేర్కొంది.
 
మార్స్ ఆర్బిటర్‌కు గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం ధృవీకరించింది. భారతదేశ చారిత్రాత్మక మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM) మంగళయాన్ ను 2013, నవంబర్ 5న ప్రయోగించ‌గా.. సెప్టెంబర్ 24, 2014న మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల సేవ‌లందించిన మంగ‌ళ‌యాన్ లో  బ్యాటరీ, ఇంధనం అయిపోయిందని ఇస్రో తెలిపింది. ఈ సమాచారం ఒక రోజు ముందుగానే అంటే.. ఆదివారం తెరపైకి వచ్చింది.. అయినప్పటికీ ఇస్రో దానిని ధృవీకరించలేదు.

ఐదు సైంటిఫిక్ పేలోడ్‌లతో కూడిన మంగ‌ళ‌యాన్ తన ఎనిమిదేళ్లలో ప్ర‌స్తానంలో అంగ‌ర‌క ఉపరితలం, వాతావరణం-ఎక్సోస్పియర్‌పై గణనీయమైన శాస్త్రీయ అవగాహనను పెంపొందించేందుకు తోడ్పాటు అందించింద‌ని తెలిపింది. మంగళయాన్ కక్ష్యను మెరుగుపరచడం ద్వారా దాని బ్యాటరీ జీవితాన్ని పెంచడానికి ఇస్రో ప్రయత్నిస్తోంది. సుదీర్ఘ గ్రహణాల సమయంలో కూడా మంగళయాన్ శక్తిని పొందడం కొనసాగించడానికి ఇది కూడా అవసరం, కానీ ఇటీవలి అనేక గ్రహణాల తర్వాత..మంగ‌ళ‌యాన్ త‌న‌ కక్ష్య మెరుగుపడలేదు.

దాని కారణంగా దీర్ఘ గ్రహణాల సమయంలో బ్యాటరీ దానిని వదిలివేయగలదు. శాటిలైట్ బ్యాటరీ కేవలం ఒక గంట 40 నిమిషాల గ్రహణ నిడివి ఉండేలా రూపొందించినందున, ఎక్కువ కాలం గ్రహణం కారణంగా బ్యాటరీ దాదాపు అయిపోయిందని ఇస్రో వివరించింది. ఇస్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్స్ ఆర్బిటర్ వెహికల్ ఆరు నెలల సామర్థ్యంతో తయారు చేయబడింది.
 
మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) భారతదేశపు మొట్టమొదటి మార్స్ మిషన్, ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కు  450 కోట్లను వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్ ('మార్స్ ఆర్బిటర్ మిషన్' (MOM)) నవంబర్ 5, 2013 ఉదయం 2:38 గంటలకు ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి) సి-25 ద్వారా ఈ మిష‌న్ ప్ర‌యోగం విజయవంతంగా సాగింది.  దీంతో అంగారకుడిపైకి శాటిలైట్ పంపిన దేశాల సరసన భారత్ కూడా చేరింది.

ఈ మిష‌న్ విజ‌యవంతంగా ..  సెప్టెంబరు 24, 2014న అంగారకుడిపైకి చేర‌డంతో భారతదేశం తన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన మొదటి దేశంగా. సోవియట్ రష్యా, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత ప్రపంచంలో నాల్గవ దేశంగా అవతరించింది. ఇది కాకుండా.. ఇది అంగారక గ్రహానికి పంపిన అత్యంత చౌకైన మిషన్ కూడా ఇదే కావ‌డం విశేషం. గతంలో చైనా, జపాన్‌లు  మార్స్ మిషన్‌లో ప్ర‌యోగించి..  విఫలమయ్యాయి. దీంతో ఆసియాలో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్  అవతరించింది. ప్రతిష్టాత్మక 'టైమ్' మ్యాగజైన్ మంగళయాన్‌ను 2014 ఉత్తమ ఆవిష్కరణలలో ఒకటిగా పేర్కొంది.
 

click me!