ఎల్ అండ్ టీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 125 కిలోమీటర్ల రిషికేశ్-కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. భారతదేశంలోనే అతిపొడవైన 14.57 కిలోమీటర్ల సొరంగం (సొరంగం నం. 8) నిర్మాణంలో కీలక ముందడుగు పడింది.
భారతదేశంలో మరో అద్భుత నిర్మాణం పూర్తయింది. దేశంలోనే అతిపొడవైన 14.57 కిలోమీటర్ల సొరంగ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ సొరంగం ఉత్తరాఖండ్‌లో దేవప్రయాగ్ నుంచి జనసు వరకు విస్తరించి ఉంది. అత్యాధునిక సింగిల్-షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) ‘శక్తి’ సహాయంతో ఈ సాఫల్యం సాధ్యమైంది. 9.11 మీటర్ల వ్యాసంతో హిమాలయ ప్రాంతంలో అతిపెద్ద టీబీఎంగా ఇది నిలిచింది. నెలకు సగటున 413 మీటర్ల వేగంతో తవ్వకం కొనసాగి, 10.4 కిలోమీటర్ల సొరంగ భాగం టీబీఎం ద్వారా పూర్తైంది. మిగిలిన 4.11 కిలోమీటర్లు న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్‌ఏటీఎం) ద్వారా నిర్మించారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ విజయంపై మాట్లాడుతూ.. “భారత ఇంజినీరింగ్ సామర్థ్యం, క్లిష్టమైన భూభాగాల్లో రైల్వే సౌకర్యాలను అభివృద్ధి చేసే అంకితభావానికి సాక్ష్యం”గా కొనియాడారు. ఈ సొరంగం ఉత్తరాఖండ్‌లోని సుదూర ప్రాంతాలకు కనెక్టివిటీని బలోపేతం చేస్తూ, సామాజిక-ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చి, పర్యాటకం, ఆర్థిక వృద్ధిని పెంచుతుందని ధామి పేర్కొన్నారు.
ఈ విజయం ఆర్‌వీఎన్‌ఎల్‌తో సమన్వయం, నిబద్ధతను తెలియజేస్తోందని ఎల్‌అండ్‌టీ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.వి.దేశాయ్ అన్నారు. సమష్టి కృషి, అంకితభావం, ఆవిష్కరణలతో సవాళ్లను ఎదుర్కుని విజయతీరం చేరుకోవచ్చని నిరూపించిందని పేర్కొన్నారు.
రిషికేశ్, దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, గౌచర్, కర్ణప్రయాగ్‌లను కలుపుతూ, ఈ రైలు మార్గం ప్రయాణ సమయాన్ని ఏడు గంటల నుంచి రెండు గంటలకు తగ్గిస్తూ, చార్ ధామ్ యాత్రకు వెళ్లే వారికి ఉపయోగపడనుంది. ఎల్‌అండ్‌టీ ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 2, ప్యాకేజీ 4లలో బాధ్యతలు నిర్వహిస్తోంది.
ప్యాకేజీ 4లో, ఎల్‌అండ్‌టీ 14.5 కిలోమీటర్ల అప్‌లైన్, 13.1 కిలోమీటర్ల డౌన్‌లైన్‌తో దేశంలోనే అతిపొడవైన రైల్వే సొరంగాన్ని నిర్మిస్తోంది. ప్యాకేజీ 2లో 26.6 కిలోమీటర్ల సొరంగ తవ్వకం, 28 కిలోమీటర్ల సొరంగ లైనింగ్, రెండు రైల్వే వంతెనలు, ఒక రోడ్డు వంతెన, కట్టడాల నిర్మాణం చేపడుతోంది.