
భారత స్వాతంత్ర పోరాటంలో తుపాకులు, జెండాలతో వీరులు పోరాడుతుంటే, రామ్ సింగ్ తన సంగీతంతో దేశభక్తిని రగిలించారు. ఆయన స్వరాలు ఆ పోరాటానికి ఊపిరి పోశాయి. ‘కదం కదం బఢాయే జా’ పాట ప్రతి భారతీయుడి హృదయంలో ఉత్సాహాన్ని నింపగా, జాతీయ గీత స్వరం దేశానికి గౌరవాన్ని చాటింది.
రామ్ సింగ్ 1927లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి ధర్మశాల కాంటోన్మెంట్‌లో పనిచేశారు. తరువాత సింగపూర్‌కు బదిలీ అయ్యారు. 1942లో జపాన్ సైన్యం చేతిలో యుద్ధ ఖైదీగా చిక్కుకున్నారు. అయితే ఆయన సంగీత ప్రతిభ కారణంగా శత్రువులు కూడా ఆయనను గౌరవించేవారు, కఠిన శిక్షల నుంచి రక్షించేవారు.
ఈ కాలంలోనే రామ్ సింగ్ నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ను కలిశారు. బోస్ ఆయన సంగీత ప్రతిభను గుర్తించి, ఐఎన్ఏ కోసం దేశభక్తిని రగిలించే పాటలు రూపొందించాలని ఆదేశించారు. “నీ పాట శబ్దం అంత శక్తివంతంగా ఉండాలి, కాథే భవనం చీలిపోవాలి, ఆకాశం కనిపించాలి” అని నేతాజీ ప్రేరణ ఇచ్చారు.
ఈ ప్రేరణతో రామ్ సింగ్ ‘కదం కదం బఢాయే జా’ పాటను రూపొందించారు. ఇది 30 లక్షల మంది ఐఎన్ఏ సైనికులు పాడిన స్ఫూర్తి గీతంగా నిలిచింది. యుద్ధరంగంలో, ప్రజా ఉద్యమాల్లో ఈ పాట గర్జన దేశభక్తిని నింపింది.
రామ్ సింగ్ తరువాత రవీంద్రనాథ్ టాగూర్ రచించిన ‘జన గణ మన’కు స్వరరచన చేశారు. ఈ స్వరం భారత జాతీయ గీతంగా ఆమోదించారు. ఆయన కృషిని గుర్తించి 1947లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ఎమెరిటస్ మ్యూజిషియన్’ బిరుదును ప్రదానం చేసింది. స్వాతంత్ర పోరాట సమయంలో సంగీతంతో దేశాన్ని ప్రేరేపించిన ఈ మహనీయుడు భారత సంగీత చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.