
వివరాల్లోకి వెళితే.. నగరంలోని బేగూర్ ఇండస్ట్రియల్ లేఅవుట్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో తవ్వకాలు చేస్తున్న క్రమంలో పెద్ద మొత్తంలో పుర్రెలు, అస్థిపంజర భాగాలు బయటపడటంతో, నివాసితులలో తీవ్ర భయాందోళన నెలకొంది. కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న వాసులు “ఇన్నాళ్లు మేము ఎముకల మీదే ఉన్నామా?” అనే ఆందోళనకు గురయ్యారు.
అపార్ట్‌మెంట్‌లోని స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదేశాల మేరకు శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఈ క్రమంలో సెల్లార్‌లో కొంత లోతు తవ్విన వెంటనే పదుల సంఖ్యలో పుర్రెలు, ఇతర ఎముకల భాగాలు కనిపించాయి.
ఈ దృశ్యాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అపార్ట్‌మెంట్ RWA అధ్యక్షుడుకి సమాచారం అందించగా, అతడు బేగూర్ పోలీసులను సంప్రదించాడు.
వెంటనే స్పందించిన పోలీసులు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అస్థిపంజర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అవి మనిషివా లేక జంతువులవా? అన్నది నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు పంపించారు. ఫలితాలు వారం రోజుల్లో రానున్నాయని అధికారులు తెలిపారు.
బయటపడిన అవశేషాలు మానవ శరీరానికి చెందిందిగా భావిస్తున్నప్పటికీ ఫోరెన్సిక్ నివేదిక వచ్చే వరకు వేచి చూడనున్నారు. పోలీసులు ప్రస్తుతం **BNSS 2023 (భారతీయ నాగరిక సురక్షా సంహిత)**లోని సెక్షన్ 194(3)(iv) కింద కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో, అపార్ట్‌మెంట్‌లోని ఇతర పిట్‌లను కూడా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతంలో స్మశానవాటిక ఉండేదని స్థానికులు అంటున్నారు. ఇది నిజమే అయితే, ప్రస్తుతం కనిపించిన పుర్రెలు అనేక దశాబ్దాల క్రితం వదిలిపెట్టిన మానవ అవశేషాలు కావచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై పోలీస్ ఉన్నతాధికారి స్పందిస్తూ.. “ఇది కేవలం ఊహాగానమే. అసలు నిజం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంది” అని తెలిపారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చాక, అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 45 కుటుంబాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. “ఇంతకాలంగా ఇక్కడ నివసిస్తున్నాం. కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. పిల్లలు కూడా భయపడుతున్నారు” అని వాపోతున్నారు.
బెగూర్ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు కలసి ఈ విషయాన్ని శాస్త్రీయంగా విచారిస్తున్నారు. పాత మిస్సింగ్ కేసులు, భూ చరిత్ర, అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ముందు ఉన్న స్థితిగతులు అన్నింటినీ పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టుతోపాటు పాత రికార్డులు, మ్యాపులు కూడా పరిశీలించనున్నట్టు సమాచారం.
మొత్తం మీద ఈ ఘటన బెనగుళూరు వాసులను ఉలిక్కిపడేలా చేసింది. మరి ఈ ఎముకల వెనకాల ఏదైనా నేరం దాగి ఉందా.? లేదా స్థానికులు అంటున్నట్లు స్మశాన వాటికకు సంబంధించినవేనా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.