Trump India Pakistan : మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోమన్న మోడీ.. ఐ లవ్ పాక్ అన్న ట్రంప్.. అమెరికా వ్యాఖ్యలు దేనికి సంకేతం?

Published : Jun 18, 2025, 11:02 PM IST
Modi Trump Phone Call

సారాంశం

Trump India Pakistan: భారత్ - పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి ట్రంప్ కామెంట్స్ చేశారు. అయితే, మిడియేషన్ అంగీకరించమని ప్రధాని మోడీ స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ 'ఐ లవ్ పాకిస్తాన్' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Trump India Pakistan : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతను తానే ఆపినట్టు ప్రకటించారు. ఇదే సమయంలో ఐ లవ్ పాకిస్తాన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం (జూన్ 18) మీడియాతో మాట్లాడుతూ, "నేనే యుద్ధాన్ని ఆపాను. నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం. మోడీ అద్భుతమైన నాయకుడు. నిన్న ఆయనతో మాట్లాడాను. మేము ట్రేడ్ డీల్ చేయబోతున్నాం. ఇరు దేశాల మధ్య నేను యుద్ధాన్ని ఆపేశాను" అని కామెంట్స్ చేశారు.

ఈ ప్రకటనకు ముందు జరిగిన పలు పరిణామాలను గమనిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో 26 మంది మరణించారు. ఆ దాడి వెనుక పాకిస్తాన్ మద్దతు ఉగ్రవాదుల హస్తం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే భారత్ పాక్ లోని ఉగ్రవాదులను టార్గెట్ చేసింది. భారత్ మే 6-7 రాత్రి "ఆపరేషన్ సింధూర్" పేరిట పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను దాడలు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాలు దాడులు జరుపుకున్నాయి.

యుద్ధం ఆపడానికి అమెరికా చర్చలు జరిపింది : డొనాల్డ్ ట్రంప్

మే 10న ట్రంప్ సోషల్ మీడియా వేదికగా.. భారత్-పాకిస్తాన్ మధ్య "పూర్తి, తక్షణ యుద్ధ విరమణ"కు వారు అంగీకరించారని తెలిపారు. ఇది అమెరికా మధ్యవర్తిత్వంతో సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

"రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను. ఇది పెద్ద విషయం. కానీ దానిపై ఒక్క కథనమైనా రాయలేదని నాకు అనిపించింది" అని ట్రంప్ తెలిపారు.

మోడీ-ట్రంప్ మధ్య 35 నిమిషాల ఫోన్ సంభాషణ

జూన్ 18న, డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ కాల్ ట్రంప్ అభ్యర్థన మేరకే జరిగిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిశ్రి తెలిపారు. ఫోన్ సంభాషణ సుమారు 35 నిమిషాల పాటు సాగిందని చెప్పారు.

మిశ్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాని మోడీ మోడీ అమెరికా అధ్యక్షునికి పహల్గామ్ ఉగ్రదాడిపై పూర్తి సమాచారం అందించారు. "ఇది ప్రాక్సీ వార్ కాదు, యథార్థ యుద్ధంగా భారత్ చూస్తోంది" అని మోడీ స్పష్టంగా చెప్పారు.

ఈ సందర్భంగా మోడీ, ఆపరేషన్ సింధూర్‌లో భారత్ టార్గెట్లుగా ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసిందని, అది తీవ్రతను పెంచే చర్య కాదని వివరించారు.

మధ్యవర్తిత్వంతో కాదు.. మేమే యుద్ధ విరమణపై నిర్ణయం తీసుకున్నాం: ప్రధాని మోడీ

భారత ప్రభుత్వం  స్పష్టమైన ప్రకటన చేసింది. అమెరికా జోక్యంతో యుద్ధ విరమణ జరగలేదని పేర్కొంది. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్వయంగా భారత DGMOని సంప్రదించి కాల్పుల విరమణ కోరినట్టు భారత వర్గాలు వెల్లడించాయి.

మోడీ కూడా ట్రంప్‌తో ఫోన్ సంభాషణలో “భారత్ ఎప్పటికీ మూడవ పార్టీ జోక్యాన్ని అంగీకరించదు” అని పేర్కొన్నారని మిశ్రి తెలిపారు. “ఈ విషయంపై భారత్‌లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉంది” అని మిశ్రి స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యల ద్వారా మోడీ, ట్రంప్ ఇటీవల పదేపదే చేస్తున్న, ఆధారాలు లేని మధ్యవర్తిత్వపు వాదనలను ఖండించారు. మేలో జరిగిన భారత్-పాకిస్తాన్ మిలిటరీ ఉద్రిక్తతలకు ముగింపు పలికించడంలో తన పాత్ర ఉందని ట్రంప్ వెల్లడించిన మాటలను ప్రధాని నేరుగా తిరస్కరించినట్టయ్యింది. అయితే, ట్రంప్ తో మోడీ ఫోన్ లో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ఐ లవ్ పాక్ అమెరికా అధ్యక్షుడు కామెంట్స్ చేయడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.

ట్రంప్ - మునీర్ భేటీ: పాక్ ఆర్మీ చీఫ్‌ను సత్కరించిన అమెరికా అధ్యక్షుడు

డొనాల్డ్ ట్రంప్ బుధవారం మధ్యాహ్నం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌లో లంచ్‌కి ఆహ్వానించారు. “ఈయన (మునీర్) పాక్ వైపు నుండి యుద్ధం ఆగిపోవడంలో ముఖ్య పాత్ర పోషించారు” అని ట్రంప్ అన్నారు.

"మోడీ, మునీర్... ఇద్దరూ తమ దేశాల తరఫున కలిసికట్టుగా యుద్ధాన్ని ఆపారు. నేను దాన్ని నడిపించాను. వాళ్లిద్దరూ అణ్వాయుధ దేశాలు. ఇది పెద్ద విషయం" అని ట్రంప్ అన్నారు. ఇదే సమయంలో ఐ లవ్ పాక్ అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపటంలో తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ ఎంతగా వాదించినా, భారత్ మాత్రం అదేమీ లేదని తేల్చి చెబుతోంది. ఈ విషయంలో మేమే నిర్ణయం తీసుకున్నాం, మూడవ పార్టీ జోక్యం లేదని స్పష్టం చేసింది. ఈ అంశంతో పాటు ట్రంప్ తాజా వ్యాఖ్యలు దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు ఎటు వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

భారత్ - అమెరికా సంబంధాలపై ప్రభావం?

విదేశాంగ మంత్రిత్వ ఇవి చాలా సున్నితమైన విషయాలుగా పేర్కొంది. గతంలోనూ ప్రముఖ నేతలు ఒకరిపై మరొకరు వ్యాఖ్యలు చేయడం ద్వారా సంబంధాలు దెబ్బతిన్న ఉదాహరణలు ఉన్నాయి. 2002లో ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్ షిరాక్ అమెరికా ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి. 2013లో జర్మనీ చాన్సలర్ అంగెలా మర్కెల్ అమెరికా నిఘా విధానాలను విమర్శించడంతో కూడా సంబంధాల క్షీణతకు కారణం అయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ట్రంప్‌తో మూడవ పక్ష జోక్యం అంగీకరించదనేది నేరుగా చెప్పడం ప్రత్యేకం. ట్రంప్‌కి భారత ప్రధాని “స్నేహితుడిగా” ఉన్నా, డిప్లోమసీలో స్పష్టత అవసరమని భారత్ చూపించింది. మునీర్ పర్యటన నేపథ్యంలో జరిగిన ఈ పరిణామాలు, భారత్ వ్యూహాత్మక దౌత్య తీరును ప్రతిబింబిస్తున్నాయి.

ఒకప్పుడు ఆసియా రాజకీయాల్లో చక్రం తిప్పేలా భారత్-అమెరికా సంబంధాలు కొనసాగాయి. ప్రజాస్వామ్య దేశాలుగా, ప్రపంచ రాజకీయాల్లో సహకారం పెంచుకుంటూ, పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేసే దేశాలుగా ఈ ద్వయం అభివృద్ధి చెందుతుందని ఆశలు పెంచాయి. కానీ ట్రంప్ తీరుతో ఇప్పుడు ఆ సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయనే ఆందోళనలు నెలకొంటున్నాయి. 

డొనాల్డ్ ట్రంప్ పాలనలో వాషింగ్టన్ తన దృష్టిని స్పష్టంగా పాకిస్తాన్ పక్షాన మళ్లించిదనే సంకేతాలు పంపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌ను దానికి స్థావరంగా ఉన్న పాక్ తో సమానంగా చూడటం తీవ్ర పరిణామాల్లోకి తీసుకెళ్తోంది.

భారత్‌పై దాడులు చేసిన ఇస్లామిక్ ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో, బాధిత దేశంగా భారత్‌కి మద్దతు ఇవ్వాల్సిన సమయంలో అమెరికా మరోవైపు పాక్ కు అనుకూలంగా కామెంట్స్ చేస్తోంది. ఇది భారత్‌లో పెద్ద ఎత్తున నిరాశకు దారి తీసిందని చెప్పాలి. ఉగ్రదాడుల వెనుక పాక్ ఉందని తెలిసి ఆ దేశ ఆర్మీ ఛీప్ కు విందును ఇవ్వడం కూడా భారత్ కు వ్యతిరేక చర్యగా చూడవచ్చు.

అలాగే, వాణిజ్య రంగంలో కూడా భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ పాలనలో అమెరికా భారత్ ఎగుమతులపై పన్నుల విషయంలో తీసుకున్న చర్యలు భారత వాణిజ్యానికి గట్టినష్టం వాటిల్లింది. అంతేకాకుండా, యాపిల్ వంటి కంపెనీల భారత పెట్టుబడులకు ట్రంప్ స్పష్టంగా వ్యతిరేకత తెలిపిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక పరంగా కూడా ద్వైపాక్షిక సంబంధాలకు బలహీన పడుతున్న సందర్భంగా చూడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !