Article 370: సుప్రీం తీర్పుపై జమ్ము కశ్మీర్ ప్రధాన పార్టీల నేతలు ఏమన్నారు?

By Mahesh K  |  First Published Dec 11, 2023, 3:12 PM IST

జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణం 370ని రద్దు చేయడంపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ తీర్పుపై జమ్ము కశ్మీర్‌లోని ప్రధాన పార్టీల నేతలు ఏ విధంగా స్పందించారు?
 


న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన అధికరణం 370పై కేంద్ర ప్రభుత్వ చర్యను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సమంజసమని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండియన్ యూనియన్‌లో జమ్ము కశ్మీర్ సంస్థానం విలీనం సులువుగా జరగడానికి తెచ్చిన తాత్కాలిక నిబంధన ఆర్టికల్ 370 అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇండియన్ యూనియన్‌లోని ఇతర రాష్ట్రాల హోదాకు జమ్ము కశ్మీర్‌ను తీసుకురావడానికి ఈ తాత్కాలిక అధికరణం దోహదపడుతుందని తెచ్చినట్టు వివరించింది. ఇండియన్ యూనియన్‌లో కలిసిన తర్వాత జమ్ము కశ్మీర్ సార్వభౌమత్వం రద్దు అవుతుందని వివరించింది. జమ్ము కశ్మీర్ కన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ కేవలం రాజ్యాంగ నిర్మాణానికి మాత్రమే ఏర్పాటు చేయబడిందని తెలిపింది. 2019లో జమ్ము కశ్మీర్ నుంచి కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్‌ను వేరు చేయడాన్నీ సుప్రీంకోర్టు తప్పుపట్టలేదు.

అదే విధంగా జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ వెలువరించిన ప్రత్యేక రూలింగ్‌లో గాయపడ్డ జమ్ము కశ్మీర్‌ కుదుటపడే పని చేయాలని సూచనలు చేశారు. 1980ల నుంచి జమ్ము కశ్మీర్‌లో జరిగిన మానవ హక్కుల హననాలపై నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని తెలిపారు. ట్రుత్ అండ్ రికన్సిలియేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

Latest Videos

undefined

Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేసుల్లేని అమాత్యులు ముగ్గురే.. అత్యధికంగా కేసులు సీఎంపైనే..

2019 ఆగస్టు 5వ తేదీన పార్లమెంటులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ తీర్పును బీజేపీ స్వాగతించింది. కానీ, ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన జమ్ము కశ్మీర ప్రధాన పార్టీల నాయకులు ఈ తీర్పుపై ఏమన్నారో ఓ సారి చూద్దాం.

గులాం నబీ ఆజాద్:

జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ చైర్మన్ గులాం నబీ ఆజాద్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 370పై ఇచ్చిన తీర్పుపై స్పందించారు. ఈ తీర్పు బాధాకరం, దురదృష్టకరం అని అన్నారు. ఈ తీర్పుతో కశ్మీరీ ప్రజలు సంతసించరని తెలిపారు. కానీ, ఈ తీర్పును అంగీకరించాల్సిందే అని వివరించారు.

Also Read: Free Bus: మహిళలకు టికెట్ ఇచ్చిన కండక్టర్ పై దర్యాప్తు పూర్తి.. టికెట్లు ఎందుకు ఇచ్చాడంటే?

మెహబూబా ముఫ్తీ:

జమ్ము కశ్మీర్ ప్రజలు తమ ఆశను కోల్పోరని, రాజీ పడరని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీప్ మెహబూబా ముఫ్తి తెలిపారు. గౌరవం, ఆత్మాభిమానం కోసం చేసే తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ తీర్పుతో మా మార్గం ముగిసిపోయిందని అనుకోము అని స్పష్టం చేశారు. ఇది భారత్ అనే ఆలోచన ఓటమి అని వివరించారు.

కాంగ్రెస్ నేత కరణ్ సింగ్:

జమ్ము కశ్మీర్ సంస్థానాన్ని పాలించిన మహారాజ హరిసింగ్ కొడుకు, కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ తీర్పుపై అసంతృప్తితో ఉన్న జమ్ము కశ్మీర్‌లోని కొందరు.. అనివార్యమైన ఈ తీర్పును అంగీకరించాల్సిందేనని కోరుతున్నానని తెలిపారు. ఇది జరిగిపోయిందనే వాస్తవాన్ని జీర్ణించుకోవాలని వివరించారు. ఆ చర్యలను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని, కాబట్టి, తలను గోడకేసి బాదుకోవడం వల్ల ఒనగూరేదేమీ లేదని అన్నారు.

Also Read: Bandi Sanjay Kumar: అంతా మన మంచికే.. కరీంనగర్ పార్లమెంటు సీటుపై ‘బండి’ ఫోకస్.. ప్లాన్ ఇదే

ఒమర్ అబ్దుల్లా:

నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఈ తీర్పు నిరాశ పరిచిందని అన్నారు. కానీ, తనలోని ఆత్మస్థైర్యాన్ని తగ్గించలేదని పేర్కొన్నారు. తమ పోరాటం కొనసాగుతుందని వివరించారు. బీజేపీ ఈ స్థాయికి చేరుకోవడానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టిందని, తాము కూడా సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధం అవుతున్నామని పేర్కొన్నారు.

click me!