
జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – 2025 ఆగస్టు 21గా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన తేదీ – 2025 ఆగస్టు 22 జరగనుంది. అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ – 2025 ఆగస్టు 25ని చివరి తేదీగా నిర్ణయించారు. ఒకవేళ ఓటింగ్ అవసరమైతే.. 2025 సెప్టెంబరు 09 ఎన్నిక జరగనుంది.
ఈ సందర్భంగా జూలై 25, 2025న జారీ చేసిన ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా శ్రీ పి.సి. మోడీ, రాజ్యసభ కార్యదర్శి జనరల్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఎన్నికల కమిషన్ నియమించింది. అలాగే శ్రీమతి గరీమా జైన్ (సంయుక్త కార్యదర్శి), శ్రీ విజయ్ కుమార్ (డైరెక్టర్, రాజ్యసభ కార్యదర్శిత్వం) ను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించారు.
ఇదిలా ఉంటే జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నిక తప్పనిసరి అయింది. ధన్‌ఖడ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన రాజీనామా లేఖలో క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ధన్‌ఖడ్ పదవీకాలం ఆగస్టు 2027లో ముగియనుంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం లోక్‌సభ,రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ నిర్వహించే పరోక్ష ఎన్నికల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.