
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు కోసం చైనాను సందర్శించనున్నారు. 2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఆయన తొలిసారి చైనాకు వెళ్తున్నారు. భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న ఈ సమయంలో ఈ పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ నెల అంటే ఆగస్టు 30న ప్రధాని మోదీ జపాన్‌కు వెళతారు. అక్కడినుండి షాంఘై సదస్సుకోసం చైనాకు వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే పర్యటిస్తారు. చైనాలో జరిగే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత ప్రధాని పాల్గొనడం దౌత్య సంబంధాల్లో మార్పుకు సంకేతం. భారత్ తాజా నిర్ణయం అమెరికాను మరింత కలవరపెట్టనుంది.
మోదీ చైనా పర్యటన గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.“SCO సమావేశానికి ఇంకాా కొన్నిరోజులే సమయం ఉంది. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ, ఇతర దేశాధినేతలు పాల్గొనడం పరస్పర సౌలభ్యం ప్రకారం ఖరారవుతుంది. సరైన సమయంలో మోదీ చైనా పర్యటన గురించి అందరికీ తెలియజేస్తాం” అని గతంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు.
షాంఘై కోఆపరేషన్ సదస్సులో ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కూడా పాల్గొంటారు. ఈ క్రమంలోనే అమెరికా శత్రువులా భావిస్తున్న భారత్, రష్యా, చైనా దేశాధినేతలు ఒకే వేదికపైకి వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి మోదీ, జిన్ పింగ్, పుతిన్ లు సమావేశమై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
2025 జూన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలోని కింగ్‌డావోలో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అధికారిక వర్గాల ప్రకారం…. భారత్‌కు ఆమోదయోగ్యం కాని ఒప్పందాలపై సంతకం చేయడానికి రక్షణమంత్రి రాజ్ నాథ్ నిరాకరించారు. భారత్ అభ్యంతరాల కారణంగా ఈ సమావేశం తర్వాత SCO ఉమ్మడి ప్రకటన విడుదల చేయలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ పై టారీఫ్స్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై టారీఫ్స్ పెంచుతున్నట్లు వెల్లడించారు. భారత్ పై 25 శాతం టారీఫ్స్ తో పాటు ఫెనాల్టీలు కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే చైనాపై కూడా భారీ టారీఫ్స్ వేసింది అమెరికా. ఉక్రెయిన్ తో యుద్దం కొనసాగిస్తున్న నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో ఈ మూడు దేశాలు షాంఘై కోఆపరేటివ్ సదస్సు కోసం ఒకేచోటికి రావడం ఆసక్తికరంగా మారింది.