జీవితంలో ఏమైనా చేయండి.. మీ మాతృభాషను ఎప్పటికీ వదులుకోవద్దు : అమిత్ షా

By Mahesh RajamoniFirst Published Mar 19, 2023, 2:41 AM IST
Highlights

 Vadodara: జీవితంలో ఏమైనా  చేయండి కానీ మాతృభాషను మాత్రం వదులుకోవద్దని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాజా సయాజీరావ్ విశ్వవిద్యాలయం 71వ స్నాతకోత్సవంలో పట్టభద్రులైన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన ఆయన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020ని అధ్యయనం చేయాలని కోరారు.

Union Home Minister Amit Shah: మున్ముందు జీవితంలో ఏమైనా చేయ‌డి కానీ యువత మాతృభాషను వదులుకోవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బరోడా మహారాజా సయాజీరావ్ విశ్వవిద్యాలయం 71వ స్నాతకోత్సవంలో పట్టభద్రులైన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన ఆయన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020ని అధ్యయనం చేయాలని కోరారు. "డిగ్రీ చదివిన వారందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ జీవితంలో ఏం చేసినా మాతృభాషను వదులుకోవద్దు. (ఫలానా భాషలో ప్రావీణ్యం సంపాదించడం) మీకు ఆమోదాన్ని ఇస్తుందనే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుండి బయటకు రండి" అని ఆయన హిందీలో ప్రసంగించారు.

"భాష ఒక వ్యక్తీకరణ, ఒక పదార్థం కాదు. భావ వ్యక్తీకరణకు ఏ భాష అయినా ఉండొచ్చు. ఒక వ్యక్తి తన మాతృభాషలో ఆలోచించి పరిశోధన, విశ్లేషణలు చేసినప్పుడు, దాని సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. విశ్లేషణతో పాటు తర్కం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. వ్యక్తిత్వ వికాసానికి మాతృభాష ఉత్తమ మాధ్యమమని  ఆయ‌న అన్నారు.  మ‌న దేశంలోని భాషలకు ఉత్తమ వ్యాకరణం, సాహిత్యం, కవిత్వం, చరిత్ర ఉన్నాయనీ, వాటిని సుసంపన్నం చేయకపోతే దేశ భవిష్యత్తును మెరుగుపర్చలేమని అమిత్ షా చెప్పారు. అందుకే ఎన్ఈపీ కింద ప్రాథమిక విద్యలో మాతృభాషను తప్పనిసరి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భావించారన్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎన్ఈపీ చదవాలని, ఇది విద్య వినియోగంపై వారి భావనలను క్లియర్ చేస్తుందని ఆయన అన్నారు.

అందుబాటులో ఉండే విద్య గురించి మహారాజా సాయాజీరావ్ ఆలోచన, సర్దార్ పటేల్ సాధికారత ఆలోచన, అంబేడ్కర్ జ్ఞానం, అరబిందో సాంస్కృతిక, జాతీయవాద విద్య ఆలోచన, మాతృభాషకు గాంధీ ఇచ్చిన ప్రాధాన్యత ఎన్ఈపీలో ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. బరోడా సంస్థానాన్ని పరిపాలించిన మూడవ సాయాజీరావ్ గైక్వాడ్ ఆదర్శవంతమైన పాలనా వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మన రాజ్యాంగాన్ని రూపొందించారనీ, ఇది ప్రపంచంలోనే ఉత్తమమైనదనీ, మహారాజా గైక్వాడ్ తనకు స్కాలర్ షిప్ ఇచ్చినందున తాను దీన్ని సాధించగలిగానని అమిత్ షా అన్నారు. విద్య వ్యాప్తికి, న్యాయ స్థాపనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, రైతులకు సాగునీరు అందించడానికి, సామాజిక సంస్కరణలు చేపట్టడానికి గైక్వాడ్ కృషి చేశార‌న్నారు. నిర్బంధ, ఉచిత విద్యను అందించేందుకు ఆయన కృషి చేశారని, ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీకి పునాది వేశారని అమిత్ షా కొనియాడారు.

విద్యను స్ట్రీమ్ లెస్ గా, క్లాస్ లెస్ గా మార్చేందుకు ఎన్ఈపీ ప్రయత్నించిందన్నారు. "అలా జరిగినప్పుడు, మీరు స్వేచ్ఛగా ఆలోచించగలరు. చదువు లక్ష్యం డిగ్రీ, మంచి ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సౌకర్యాలు పొందడం కాదు. సంపూర్ణ మానవుడు కావడమే దాని లక్ష్యమని, విద్య ప్రవాహం లేకుండా, వర్గరహితంగా ఉన్నప్పుడే అది సాధ్యమని, అందుకే ప్రధాని మోడీజీ ఆ దిశగా ప్రయత్నించారని అన్నారు. ఏ భావజాలం లేదా రాజకీయ పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కోని దేశంలోనే తొలి విద్యావిధానం ఎన్ఈపీ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు నర్దిపురాలో పునర్నిర్మించిన సరస్సును ప్రారంభించిన అమిత్ షా తన లోక్ సభ నియోజకవర్గమైన గాంధీనగర్ లోని కలోల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గాంధీనగర్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీల (దిశ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

click me!