దీదీ దాదాగిరి: తొలి మహిళా డీజీపిపై వేటు, అసలేం జరిగింది?

First Published May 25, 2018, 7:43 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహానికి కర్ణాటక తొలి మహిళా డీజిపి నీలమణి రాజుపై వేటు పడింది.

బెంగళూరు: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహానికి కర్ణాటక తొలి మహిళా డీజిపి నీలమణి రాజుపై వేటు పడింది. ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకు మమత బెనర్జీ బుధవారం బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే.

మమతా బెనర్జీకి కుమార కృప అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. అది వేదికకు కిలోమీటరు కన్నా తక్కువ దూరమే ఉంటుంది. ఆమె బయలుదేరిన సమయంలో వర్షం పడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, గవర్నర్ వాజూభాయ్ వాలా కాన్వాయ్ వెనక మమతా బెనర్జీ వాహనం చాలుక్య సర్కిల్ వద్ద ట్రాఫిక్ లో చిక్కుకుంది. 

వకారు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో ఆమెను తీసుకొని రావడానికి  డీజీపీ నీలమణి రాజు వెళ్లారు. వెంటనే ఆమె కారు దిగారు. "సారీ మేడం. ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దగ్గరికొచ్చేశాం కదా. కొద్ది దూరం నడుద్దాం" అని ఆమె చెప్పారు. 

దాంతో దీదీ తోక తొక్కిన త్రాచులా లేచారు. వేగంగా నడుచుకుంటూ వేదిక వద్దకు వెళ్లి నేరుగా మాజీ ప్రధాని దేవెగౌడకు ఫిర్యాదు చేశారు. అందరి ముందూ డీజీపీపై విరుచుకుపడ్డారు.  దాంతో మమత చేతులు పట్టుకొని దేవెగౌడ క్షమాపణ కోరారు. 

ఘటనపై తక్షణం నివేదిక సమర్పించాలంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి డీజీపీని ఆదేశించారు. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌ స్తంభించిందని, రాహుల్‌, మమత కార్లు ఒకేసారి విధానసౌధ ప్రాంగణానికి రావడంతో గందరగోళం జరిగిందని చెప్పారు. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, బీఎస్పీ అధినేత మాయావతి కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. వారిద్దరు కూడా నడుచుకుంటూ వేదిక వద్దకు వచ్చారు. 

click me!