స్మశానంలో బాలికపై హత్యాచారం: భగ్గుమంటున్న ఢిల్లీ.. కేసు క్రైం బ్రాంచ్‌కు బదిలీ, వదిలేది లేదన్న కేజ్రీవాల్

By Siva KodatiFirst Published Aug 5, 2021, 9:01 PM IST
Highlights

ఢిల్లీలో 9 ఏళ్ల మైనర్‌ బాలికపై హత్యాచార ఘటనకు సంబంధించి దర్యాప్తు బాధ్యతను క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించారు. మంచినీళ్లు తీసుకొస్తానని వెళ్లిన బాలిక ఎంతకు తిరిగిరాపోవడం, కాటికాపరి ప్రవర్తన, తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు వంటివి ఈ కేసులో చిక్కు ముడులుగా వున్నాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో 9 ఏళ్ల మైనర్‌ బాలికపై హత్యాచార ఘటన దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిని పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రముఖులు, మహిళా, బాలల హక్కుల సంఘాలు ఖండిస్తున్నాయి. కేసు తీవ్రత నేపథ్యంలో వేగంగా దర్యాప్తు చేయడానికి క్రైమ్‌ బ్రాంచ్‌కు బాధ్యతలు అప్పగించారు.

వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 1న ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలోని పాత నంగల్‌ గ్రామానికి చెందిన బాధిత బాలిక కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం సమయంలో అక్కడ ఉన్న వాటర్‌కూలర్‌ నుంచి నీళ్లు తెస్తానని తల్లికి చెప్పి వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాలేదు. ఇదే సమయంలో అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌ ఆమె తల్లి వద్దకు వచ్చి మీ అమ్మాయి చనిపోయిందని చెప్పాడు. వాటర్‌ కూలర్‌ నుంచి నీళ్లు పడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి బాలిక మరణించినట్లు చెప్పాడు. అలాగే పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోస్ట్‌మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని, పాప అవయవాలు దొంగతనం చేస్తారని చెప్పి హడావుడిగా బాలిక మృతదేహాన్ని రాత్రికి రాత్రే దహనం చేయించాడు. 

అయితే రాధేశ్యామ్‌ తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్‌ చేశారు. తమ బిడ్డపై కాటికాపరి సహా మరికొందరు అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ తమ ఇంటివద్దే న్యాయపోరాటం చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసును ఆగస్టు 4న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీసీసీఆర్) సుమోటోగా తీసుకుంది. అంతేకాకుండా 48 గంటల్లో దీనిపై సరియైన నివేదికను సమర్పించాలని ఢిల్లీ సౌత్‌ వెస్ట్‌ డీసీపీకి ఎన్‌సీసీసీఆర్ లేఖ రాసింది. ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా ఈ కేసు బదిలీకి దిశానిర్దేశం చేశారు.

మరోవైపు ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఉన్నత న్యాయవాదులను నియమిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఢిల్లీలో శాంతిభద్రతలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా బాధితురాలి తల్లి తల్లి స్టేట్‌మెంట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.

click me!