కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం ప్రారంభించారు. వాటిని రద్దు చేసిన తర్వాత కూడా దేశ రాజధాని సరిహద్దుతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ రైతు మహా పంచాయత్‌లు నిర్వహిస్తూ.. అన్నదాతల గొంతుకను ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు పేర్కొంటున్నారు.
దేశంలోని రైతన్న ఆరుకాలం కష్టించి.. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనికి తోడు పెరుగుతున్న ఎరువుల ధరలు, విత్తనాల ధరలు రైతులను మరింతగా కుంగదీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు వుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వ చర్యలను భరించిన రైతన్న మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు అలుపెరుగని పోరాటం సాగించాడు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆ చట్టాల రద్దుకు ఆమోదం తెలిపింది. రైతులు ఆందోళనలు విరమించాలనీ, ఢిల్లీ సరిహద్దు నిరసన స్థలిని వదిలి ఇండ్లకు చేరాలని ప్రభుత్వం పేర్కొంది.
Also Read: రెట్టింపు వేగంతో ఒమిక్రాన్ పంజా.. రంగంలోకి డబ్ల్యూహెచ్‌వో
undefined
అయితే, రైతులు మాత్రం ఇప్పట్లో తమ ఉద్యమాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇదే విషయమై 40 కి పైగా రైతు సంఘాలకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చ.. తాజాగా రైతు ఉద్యమం ముందుకు సాగుతుందనీ, దీనిని ఆపే ప్రసక్తే లేదని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికి సమాచారం రాలేదని తెలిపింది. అయితే, రైతులను మాత్రం నిరసనల స్థలాలను వదిలి ఇండ్లకు చేరాలని అన్నదాతలను బలవంతం చేస్తున్నదని సంయుక్త్ కిసాన్ మోర్చ తెలిపింది. ప్రభుత్వానికి, రైతులకు మధ్య సఖ్యత కుదరలేదనీ, వివాదాలే నడుస్తున్నాయని వెల్లడించింది. రైతు సానుకూల ప్రభుత్వ ప్రకటన కోసం అన్నదాతలు ఓపికగా ఎదురుచూస్తున్నారని తెలిపింది. పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పై చట్టపరమైన హామీ, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించడం వంటి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న అన్నదాతల ఉద్యమంత ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. అలాగే, దేశవ్యాప్తంగా రైతు మహా పంచాయత్‌లు సైతం నిర్వహిస్తామని తెలిపారు.
Also Read: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..
ఇదిలావుండగా, వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఉభయ సభులు ఆమోదించిన తర్వాత.. రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిందనీ, గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేయబడిందనే విషయాన్ని కూడా SKM ప్రస్తావించింది. "దీనితో, ఒక ముఖ్యమైన రైతన్నల ఉద్యమం.. యుద్ధం అధికారికంగా ముగిసింది. నిరసన తెలిపిన రైతులు తమ ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి విజయాన్ని సాధించారురు" అని SKM ప్రకటన పేర్కొంది. అయితే, పార్లమెంట్‌లో రైతు ఉద్యమంలో మరణించిన అన్నదాతల వివరాలు తమ వద్ద లేవనీ, పరిహారం కూడా అందించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతేడాది రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల సందర్భంగా అమరులైన రైతులకు సంతాప నివాళులు అర్పించిన విషయాన్ని SKM గుర్తుచేసింది. అమరులైన రైతు కుటుంబాలకు సాయం అందించాలని డిమాండ్ చేసింది.
Also Read: ఇంటర్నెట్ సస్పెన్షన్.. దేశానికి అప్రతిష్ట !
అలాగే, ఎస్‌కేఎం ఆధ్వర్యంలో రైతు సంఘాలు హర్యానలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఆరు రైతుల డిమాండ్లను పునరుద్ఘాటించాయి. అలాగే, హర్యానా ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలను మానుకోవాలని పేర్కొన్నాయి. రాష్ట్రంలో రైతు నిరసనలను అరికట్టేందుకు ఆమోదించిన "అప్రజాస్వామిక" చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
Also Read: పెరిగిన ప్రజా ఫిర్యాదులు.. పార్లమెంట్ నాల్గో రోజు అంశాలివిగో !