Delhi Pollution: పాక్ నుంచే కలుషిత వాయువులు.. అక్కడ పరిశ్రమలు నిషేధిద్దామా?: సుప్రీంకోర్టులో వాదనలు

Published : Dec 03, 2021, 12:21 PM ISTUpdated : Dec 03, 2021, 12:24 PM IST
Delhi Pollution: పాక్ నుంచే కలుషిత వాయువులు.. అక్కడ పరిశ్రమలు నిషేధిద్దామా?: సుప్రీంకోర్టులో వాదనలు

సారాంశం

ఢిల్లీ కాలుష్య  నివారణపై సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగిన వాదనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీని ప్రభావితం చేస్తున్న కలుషిత వాయువులు పాకిస్తాన్ నుంచే వస్తున్నాయని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అంతేకాదు, ఆ కలుషిత వాయువులు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వైపు వస్తున్నాయని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ స్పందించారు. అంటే పాకిస్తాన్‌లోని పరిశ్రమలపై నిషేధం విధించాలని మీరు భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యం(Air Pollution) అంశంపై Supreme Court సీరియస్‌గా విచారణలు జరుపుతున్న సంగతి తెలిసిందే. చర్యలు తీసుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశాలు  జారీ చేస్తున్నది. ఢిల్లీ కాలుష్యంపై ఈ రోజు జరిగిన వాదనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాయు కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా పరిశ్రమలను మూసేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. పరిశ్రమలు మూసేయడం వల్ల చెరుకు, పాల పరిశ్రమలపై ప్రభావం పడుతుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీని ప్రభావితం చేస్తున్న కలుషిత వాయువులు Pakistan నుంచే వస్తున్నాయని పేర్కొంది. Uttar Pradesh దిగువన ఉండటం మూలంగా ఢిల్లీ మీదుగా ఆ వాయువులు తమ రాష్ట్రానికి కూడా వస్తున్నాయని తెలిపింది. ఈ వాదనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(CJI NV Ramana) వెంటనే స్పందించారు. అంటే.. పాకిస్తాన్‌లోని పరిశ్రమలను(Industries) నిషేధించాలని(Ban) మీరు భావిస్తున్నారా? అంటూ పేర్కొన్నారు.

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు కేవలం కాగితాలపైనే కట్టడి చర్యలు చూపిస్తున్నట్టు తెలుస్తున్నదని, ఎందుకంటే క్షేత్రస్థాయిలో కాలుష్యం తగ్గడం లేదని ఇది వరకే సుప్రీంకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే పరిశ్రమలు, వాహనాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. 24 గంటల డెడ్ లైన్ పెడుతూ ఈ ఆదేశాలు నిన్ననే జారీ చేసింది. దీనిపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. నిర్మాణ పనులపై నిషేధం విధించడంపై మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

Also Read: Delhi Pollution: మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం: ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

పెరుగుతున్న కాలుష్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి నిర్మిస్తున్న హాస్పిటళ్లపై నిషేధం విధించడం సమస్యను జఠిలం చేసినట్టే అవుతుందని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అభిప్రాయపడింది. ఈ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించింది. హాస్పిటళ్ల నిర్మాణాలకు నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి మినహాయింపు ఇచ్చింది. హాస్పిటళ్లకు సంబంధించిన నిర్మాణాలకు సుప్రీంకోర్టు అనుమతించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో స్కూల్స్ బంద్.. ప‌రీక్ష‌ల్లేవ్‌.. ఎందుకంటే?

కేంద్ర ప్రభుత్వంపై గత విచారణల్లో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలను అమలు చేయడానికి ఐదుగురు సభ్యులతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కాలుష్య నివారణ చర్య లు క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడటం ఈ టాస్క్ ఫోర్స్ కర్తవ్యంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఢిల్లీలోకి వచ్చే 124 ఎంట్రీ పాయింట్లలో ఇన్‌స్పెక్షన్ టీమ్‌లను మోహరించినట్టు కేంద్రం సుప్రీంకోర్టు వివరించింది. ఇందులో పోలీసు అధికారులూ ఉన్నారని తెలిపింది. సీఎన్‌జీ ట్రక్కులను మాత్రమే అవి కూడా నిత్యావసర సరుకులను తీసుకెళ్లుతున్న వాహనాలను మాత్రమే ఢిల్లీలోకి ఈ టీమ్‌లు అనుమతిస్తాయని వివరించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్