India Pakistan War: భయం వద్దు.. దేశంలో వాటి కొరత లేదు.. భ‌రోసా ఇచ్చిన కేంద్రం

Published : May 09, 2025, 11:09 PM IST
India Pakistan War:  భయం వద్దు.. దేశంలో వాటి కొరత లేదు.. భ‌రోసా ఇచ్చిన కేంద్రం

సారాంశం

భారతపాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య నిత్యావసరాల ధరల పెరగకుండా.. వాటి నిల్వలను సమీక్షించాలని.. బ్లాక్ మార్కెట్, దళారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.  భారత–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.   

శుక్రవారం రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో సమావేశమైన కేంద్రం, వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి నిధి ఖారే నేతృత్వంలో కీలక చర్చలు జరిపింది.  ఈ సందర్భంగా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖలు రాసిన కేంద్రం, కందులు, గోధుమ, బియ్యం, కూరగాయలు, నూనె, తదితర నిత్యావసరాల ధరలపై పర్యవేక్షణ ఉండాలని కోరింది. పౌరులను భయానికి గురి చేయొద్దని.. సరుకు కొరత ఏమీ లేదని స్పష్టమైన సందేశం ఇవ్వాలని సూచించింది.

వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, “ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ భద్రతా నిల్వల్లో బియ్యం 356 లక్షల టన్నులు, గోధుమలు 383 లక్షల టన్నులు ఉన్నాయి. ఇది అవసరమైన బఫర్ స్థాయికంటే అధికం. వంట నూనెలు 17 లక్షల టన్నులుగా నిల్వలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆహార కొరత లేదు” అని అన్నారు.

దళారులు, నిల్వదారులపై నిఘా ఉంచాలని, ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ వద్ద ఉన్న నిత్యావసరాల నిల్వ వివరాలు అప్లోడ్ చేయాలని వ్యాపారులను కేంద్రం ఆదేశించింది. ఈ విధానం ఇప్పటికే నూనె నిల్వల విషయంలో అమలులో ఉంది. బ్లాక్ మార్కెట్‌కి పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జోషి హెచ్చరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని సమీక్షిస్తూ, నిత్యావసరాల సరఫరా నిరాఘాటంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాస్తవానికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.5 ఏళ్ల కనిష్ట స్థాయి 3.3%కి చేరింది. ఇది తక్కువ ఆహార ధరల వల్లే సాధ్యమైందని కేంద్రం పేర్కొంది.

మొత్తంగా చూస్తే, ప్రజలు భయానికి లోనుకావాల్సిన అవసరం లేదని, కేంద్రం చేతిలో అందుబాటులో ఉన్న నిల్వలు సరిపోతాయని  ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. సరఫరా నిలకడగా కొనసాగేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు