కొవిడ్‌ టీకా మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు.. సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

By Rajesh KarampooriFirst Published Nov 29, 2022, 1:35 PM IST
Highlights

క‌రోనా వ్యాక్సినేష‌న్ వ‌ల్ల జ‌రిగిన మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.మృతులకు, వారి కుటుంబాలపై పూర్తి సానుభూతి ఉందని, అయితే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలకైనా  బాధ్యత వహించలేమని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వ్యాక్సిన్‌ వల్ల మరణం సంభవించిన సందర్భాల్లో సివిల్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి పరిహారం పొందవచ్చని కేంద్రం పేర్కొంది. గత ఏడాది కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వల్ల వేరు వేరు ఘటనల్ల ో తమ కుమార్తెలు చనిపోయారని ఇద్దరు తల్లిదండ్రులు ఆరోపిస్తూ.. దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు ప్రతిస్పందనగా కేంద్రం ఈ విధంగా అఫిడవిట్ దాఖాలు చేసింది.

కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా మరణించిన కేసులపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని, టీకా తర్వాత ఏదైనా ప్రతికూల ప్రభావాన్ని (AEFI) సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడానికి నిపుణులైన మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఇది విషాదకరమైనా ఘటన ..మృతులకు, వారి కుటుంబంపై పూర్తి  సానుభూతి ఉందని, అయితే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలకైనా బాధ్యత వహించలేమని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.  
 
నష్టపరిహారం డిమాండ్ తిరస్కరణ.. సివిల్ కోర్టులో కేసు దాఖలు..

పరిహారం కోసం పిటిషనర్ దాఖాలు చేసిన పిటిషన్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.టీకా యొక్క ప్రతికూల ప్రభావాల వల్ల ఒక వ్యక్తి శారీరకంగా గాయపడినట్లయితే లేదా మరణిస్తే, అతను లేదా అతని కుటుంబం చట్ట ప్రకారం పరిహారం లేదా నష్టపరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. దావా వేయవచ్చు. నిర్లక్ష్యానికి సంబంధించిన కేసుల వారీగా కేసు నమోదు చేయవచ్చని అఫిడవిట్ పేర్కొంది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేసి సమ్మతి తీసుకుని ఉంటే ఈ మరణాలు సంభవించి ఉండేవి కావని,  దీనిపై వివరణకు కేంద్రం కోర్టుకు తెలియజేయాలని అన్నారు.  

ప్రతికూల ప్రభావాల గణాంకాలను అందజేస్తూ.. మొత్తం వ్యాక్సిన్‌ల సంఖ్యతో పోలిస్తే ఇవి చాలా తక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. నవంబర్ 19, 2022 వరకు, దేశంలో మొత్తం 219.86 కోట్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడ్డాయని,  వీటిలో కేవలం 92,114 ప్రతికూల ప్రభావాల కేసులు నమోదయ్యాయని పేర్కొంది.ఈ కేసులలో 89,332 (అంటే 0.0041% కేసుల మాత్రమే.. స్వల్ప ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నాయనీ, 2,782 కేసులు అంటే 0.00013% మాత్రమే మరణంతో సహా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపాయని కేంద్రం తెలిపింది. 

ఫిర్యాదుదారుని కుమార్తె థ్రాంబోసిస్, థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టిటిఎస్)తో బాధపడుతున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. ఇది ప్రపంచవ్యాప్తంగా COVID-19 వ్యాక్సిన్‌ల యొక్క అరుదైన ప్రతికూల ప్రభావమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30 వరకు భారతదేశంలో TTS సంబంధించి 26 AEFI కేసులు నమోదయ్యాయి. వాటిలో 12 మాత్రమే మరణానికి దారితీశాయి. ఇవి కెనడాలో 105 మరణాలు నమోదు కాగా.. ఆస్ట్రేలియాలో 173 మరణాలు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 

మొదటి పిటిషనర్ కుమార్తె రచన గంగుకు గత ఏడాది మే 29న కోవిషీల్డ్ మొదటి డోస్ ఇవ్వగా.. జూన్ 19న మరణించింది. అదేవిధంగా రెండో పిటిషనర్ వేణుగోపాలన్ గోవిందన్ కుమార్తె ఎంఎస్సీ నాలుగో సంవత్సరం చదువుతోంది.గత ఏడాది జూన్ 18న ఆమెకు కోవిషీల్డ్ మొదటి డోస్ ఇవ్వగా.. ఆమె జూలై 10న మరణించింది. పిటిషనర్లు గత ఏడాది జూలై 14, జూలై 16 తేదీల్లో పిఎంఓకు వేర్వేరుగా దరఖాస్తులు పంపారు. దీనిపై తనకు ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ఇద్దరు బాలికలకు పోస్టుమార్టం నివేదికతో పాటు పరిహారం అందించాలని పిటిషన్‌లో కోరారు.  

click me!