సీసీటీవీలు, మెటల్ డిటెక్టర్లతో రక్షణ: హత్రాస్ బాధితురాలి ఇంటి వద్ద సెక్యూరిటీ

By narsimha lodeFirst Published Oct 9, 2020, 6:08 PM IST
Highlights

హత్రాస్ బాధితురాలి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గ్యాంగ్ రేప్ కు గురైన 19 ఏళ్ల యువతి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

లక్నో: హత్రాస్ బాధితురాలి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గ్యాంగ్ రేప్ కు గురైన 19 ఏళ్ల యువతి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.
ఈ యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసిందని ఆయన చెప్పారు.

హత్రాస్ బాధితురాలి ఇంటి వద్ద 60 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.  ఎనిమిది సీసీటీవీలను ఈ ప్రాంతంలో అమర్చారు. ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత కోసం ఈ సీసీకెమెరాలు ఉపయోగపడుతాయని పోలీసులు భావిస్తున్నారు.

యూపీలోని బుల్గర్హి గ్రామంలో బాధితురాలి ఇంటి వద్ద  పోలీసులు ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాట్లు చేశారు.  లక్నో నుండి డీఐజీ షాలాబ్ మాథూర్ ను హత్రాస్ పంపింది ప్రభుత్వం. ఆయనను నోడల్ ఆఫీసర్ గా నియమించింది యూపీ సర్కార్.

అవసరమైతే ఈ గ్రామంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ను కూడ ఏర్పాటు చేయనున్నారు అధికారులు.60 మంది పోలీసులు షిప్టులవారీగా ఈ ఇంటి వద్ద భద్రతను నిర్వహిస్తారు. ఇందులో మహిళా పోలీసులు కూడ ఉన్నారు. ఒక గెజిటెడ్ అధికారి కూడ ఇక్కడ ఉన్నారు. భద్రతను గెజిటెడ్ అధికారి పర్యవేక్షించనున్నారు.

బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు వచ్చేవారి వివరాలను పోలీసులు నమోదు చేయనున్నారు.ప్రతి కుటుంబసభ్యునికి ఇద్దరు భద్రతా సిబ్బందిని కేటాయించారు. ఈ ఇంట్లోకి వెళ్లేందుకు మెటల్ డిటెక్టర్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. పోలీస్ టీమ్ తో పాటు ఫైర్ సిబ్బందిని కూడ అందుబాటులో  ఉంచారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 14న ఆ యువతి గాయాలపాలైంది.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 30న మరణించింది.
 

click me!