Fire accident: హోట‌ల్‌లో అగ్ని ప్ర‌మాదం.. 14 మంది స‌జీవ ద‌హ‌నం

Published : Apr 30, 2025, 09:19 AM ISTUpdated : Apr 30, 2025, 09:20 AM IST
Fire accident: హోట‌ల్‌లో అగ్ని ప్ర‌మాదం.. 14 మంది స‌జీవ ద‌హ‌నం

సారాంశం

కోల్‌కతా బుర్రాబజార్‌లోని ఓ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు దూకిన ఓ వ్యక్తి కూడా మరణించాడు. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. 

కోల్‌కతా బుర్రాబజార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుర్రాబజార్‌లోని మెచువా ఫ్రూట్ మార్కెట్‌లో ఉన్న ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘోర సంఘటనలో 14 మంది సజీవ దహనం అయ్యారు. మంటల నుంచి తప్పించుకునేందుకు పాస్వాన్ అనే వ్యక్తి పైనుంచి దూకేశాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

దట్టమైన పొగ కారణంగా హోటల్ మొత్తం గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. చివరికి నిచ్చెన సాయంతో నాలుగు, ఐదు అంతస్తుల కిటికీలను పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల చిక్కుకున్న చాలామంది ఊపిరి ఆడక మరణించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. దర్యాప్తు కొనసాగుతోంది.

 

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే చాలామంది హోటల్ కార్నిస్‌పైకి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వారిని కిందికి దించారు. ఈ హోటల్‌లో చాలామంది ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. హోటల్‌లో దాదాపు 47 గదులు ఉన్నాయి. ప్రతి గదిలోనూ జనం ఉన్నారు. దట్టమైన పొగ కారణంగా అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లడం కష్టమైంది.

మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 8 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సెంట్రల్ అవెన్యూ, బిధాన్ సరణి కూడలిలో ఈ హోటల్ ఉంది. ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. దీంతో మంటలు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. మేయర్ ఫిర్హాద్ హకీం, కలెక్టర్ మనోజ్ వర్మ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పాంజా ఘటనా స్థలాన్ని సందర్శించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ