
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ తర్వాత అంటే మే 14, 2025 నుండి ఆయన ఈ పదవిని చేపడతారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
జస్టిస్ గవాయ్ 65 ఏళ్ళ వయసులో నవంబర్ 23, 2025న పదవీ విరమణ చేయనున్నందున ఆరు నెలలకు పైగా ఈ పదవిలో ఉంటారు.2010లో పదవీ విరమణ చేసిన జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ తర్వాత షెడ్యూల్డ్ కులాల నుండి ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ వ్యక్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్. ఉన్నత న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం పరంగా ఇది ఒక ముఖ్యమైన అడుగు.
జస్టిస్ బి.ఆర్. గవాయ్ బాల్యం :
నవంబర్ 24, 1960న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు జస్టిస్ గవాయ్. ప్రజాసేవ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి, దివంగత ఆర్.ఎస్. గవాయ్ ప్రముఖ సామాజిక కార్యకర్త. అంతేకాదు బీహార్, కేరళ రాష్ట్రాల గవర్నర్‌గా కూడా పనిచేశారు.
జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాది రాజా ఎస్. భోంస్లే వద్ద న్యాయ వృత్తిని ప్రారంభించారు. 1987లో బాంబే హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. రాజ్యాంగ, పరిపాలనా చట్టంపై దృష్టి సారించారు.
నాగ్‌పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయం, SICOM, DCVL వంటి ప్రభుత్వ సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. 1992 ఆగస్టులో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2000లో గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు.
న్యాయ సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిని సిజెఐ పదవికి సిఫారసు చేస్తారు. ఏప్రిల్ 16, 2025న ప్రస్తుత చీఫ్ జస్టిన్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ సిఫారసును ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా నియమించారు.