రైతు ఆందోళన.. వచ్చే ఎన్నికలు.. జమ్ము కశ్మీర్.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వీటిపై చర్చ

By telugu teamFirst Published Nov 7, 2021, 7:15 PM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గంలో రైతు ఆందోళనలు, 2022లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, జమ్ము కశ్మీర్‌లో అభివృద్ధి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింస వంటి కీలక అంశాలపై చర్చించారు. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా బీజేపీ నేతలు ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు.
 

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం(BJP National Executive meeting) ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి 342 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ప్రధాన మంత్రి Narendra Modi, పార్టీ జాతీయ అధ్యక్షుడు JP Nadda ప్రారంభించారు. గతేడాది మార్చిలో కరోనా మహమ్మారి ప్రబలిన తర్వాత తొలిసారి ప్రత్యక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు భౌతికంగా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, తమిళనాడు బీజేపీ యూనిట్ అధ్యక్షుడు కే అన్నమలై మద్దతు ఇచ్చారు. ఇందులో భాగంగా 18 సమస్యలను చర్చించారు. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలను చర్చించారు. మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.

బెంగాల్ హింస..
ఈ సమావేశంలో రైతు ఆందోళనలు(Farmers Protest), వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, Jammu Kashmirలో పరిస్థితులు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ అనంతరం హింస, ప్రతిపక్షాలు, కరోనా వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై చర్చించారు. ఈ హింసను తీవ్రంగా ఖండించారు. బెంగాల్‌లోని ప్రతి కార్యకర్తకు అండగా బీజేపీ నిలబడుతుందని ఈ తీర్మానం భరోసా ఇచ్చింది. దాడులకు గురైన ప్రతి బీజేపీ కార్యకర్తకు న్యాయం కోసం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ ద్వారా వారికి న్యాయం సమకూరుస్తామని వివరించింది. వారి కోసం కోర్టులో పార్టీ పోరాడుతుందని పేర్కొంది.

Also Read: బెంగాల్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాం: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో జేపీ నడ్డా

రైతుల ఆందోళన..
వ్యవసాయ రంగంపైనా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. అలాగే సాగు రంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషినీ గుర్తు చేశారు. కనీస మద్దతు ధరను 1.5 రెట్లు కేంద్ర ప్రభుత్వం పెంచిందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులనూ పంపిణీ చేసినట్టు తెలిపారు. అంతేకాదు, వ్యవసాయ క్షేత్రాల్లో పంపు సెట్ల‌నూ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ నిర్మతా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రైతులతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ చట్టాల్లో రైతులు వ్యతిరేకించే అంశాలేవో వినడానికి సిద్ధంగా ఉన్నామని, అసలు అభ్యంతరాలేవో ఇంకా చెప్పలేదని పేర్కొన్నారు. రైతుల నుంచి వినడానికి తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు.

వచ్చే ఎన్నికలు..
2022లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరాలనే తీర్మానం తీసుకున్నది. బూత్ స్థాయిలో ఎలా పని చేయాలో చర్చించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై చర్చ జరిపారు. ఇటీవలే జరిగిన ఉపఎన్నికలపైనా మాట్లాడారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేస్తామని పార్టీ నేత భూపేందర్ యాదవ్ వివరించారు.

Also Read: UP Assembly Polls: ఎన్నికల్లో పోటీపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

జమ్ము కశ్మీర్..
2019లో ఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత జమ్ము కశ్మీర్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని బీజేపీ నేతలు చర్చించారు. 2014 నుంచి 2021 మధ్య జరిగిన ఉగ్రదాడుల్లో కంటే 2004 నుంచి 2014 మధ్య జరిగిన ఉగ్ర దాడుల్లో ఎక్కువ మంది పౌరులు మరణించారని వివరించారు. 2004 నుంచి 2014 మధ్య 2081 మంది పౌరులు మరణించారని, అదే 2014 నుంచి 2021 మధ్య 239 మంది మరణించారని బీజేపీ పేర్కొన్నారు. కాగా, కరోనా సమయంలో ప్రతిపక్షాలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టలేదని బీజేపీ పేర్కొంది. కేవలం ట్విట్టర్ ద్వార మాత్రమే స్పందించిందని విమర్శించింది.

click me!