
Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువరి పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రతిపక్షలు ఆర్సీబీ, కర్నాటక ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నాయి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే 11 మంది చనిపోయారని ఆరోపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 'బెంగళూరులో జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని పీఎంవో ఇండియా ట్వీట్ చేసింది. అలాగే, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ప్రభుత్వాన్ని విమర్శించారు. 'ఆర్సీబీ గెలిచినందుకు ప్రభుత్వం తొందరపడి ఏర్పాటు చేసిన విజయోత్సవంలో 10 మందికి పైగా చనిపోవడం బాధాకరం' అని అన్నారు.
‘ఎలాంటి ఏర్పాట్లు లేకుండా రెండు కార్యక్రమాలు చేయడం, అందులోనూ అంతమందిని రానివ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యం. ముంబైలో ఇలాంటి సందర్భాల్లో ఊరేగింపు చేసి అందరికీ ఆటగాళ్ళను చూసే అవకాశం కల్పించారని’ అన్నారు.
'జనం ఎంతమంది వస్తారో అంచనా వేయకుండా, ఆర్సీబీ అభిమానుల ఉత్సాహం అర్థం చేసుకోకుండా పోలీసులు, నిర్వాహకులు వ్యవహరించారు. ప్రభుత్వమే దీనికి కారణం. దీనిపై విచారణ జరిపి, నిందితులను శిక్షించాలి' అని అన్నారు.
'ఇది చాలా దురదృష్టకరం. సంతోషకరమైన సందర్భంలో ఇలా జరగడం బాధాకరం. దీన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సింది' అని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.