
UPSC New Chirman Ajay Kumar: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నూతన ఛైర్మన్ గా అజయ్ కుమార్ ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం మాజీ రక్షణ కార్యదర్శి, 1985 బ్యాచ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ అజయ్ కుమార్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రీతి సూదన్ పదవీకాలం ఏప్రిల్ 29న ముగిసిన తర్వాత అజయ్ కుమార్ బాధ్యతలు చేపడతారు.
డాక్టర్ అజయ్ కుమార్ 1985 బ్యాచ్ కేరళ కేడర్ ఐఎఎస్ అధికారి. భారత ప్రభుత్వం మరియు కేరళలో పలు జిల్లాలకు కలెక్టర్ గా వ్యవహరించారు. అలాగే కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేసారు. రక్షణ శాఖలో కీలక పదవిని నిర్వహించారు.
ఆగస్టు 23, 2019 నుండి అక్టోబర్ 31, 2022 వరకు భారతదేశ రక్షణ కార్యదర్శిగా అజయ్ పనిచేశారు. ఈ సమయంలో 'అగ్నిపథ్ పథకం', 'అగ్నివీర్ నియామక ప్రక్రియ', 'ఆత్మనిర్భర్ భారత్' చొరవ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ వంటి కీలక రక్షణ సంస్కరణలకు నాయకత్వం వహించారు.
ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖలో సీనియర్ పదవుల్లో పనిచేస్తూ UPI, ఆధార్, myGov, గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ వంటి 'డిజిటల్ ఇండియా' ప్రాజెక్టుల అమలులో కీలక పాత్ర పోషించారు.
డాక్టర్ అజయ్ కుమార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఐఐటి) కాన్పూర్ నుండి బి.టెక్ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుండి అప్లైడ్ ఎకనామిక్స్‌లో ఎంఎస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. పీహెచ్‌డీని కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు.
IAS, IPS, IFS వంటి వివిధ సివిల్ సర్వీసులకు పరీక్షలు నిర్వహించే భారతదేశ ప్రధాన నియామక సంస్థ UPSC. దీనికి ఛైర్మన్‌గా అజయ్ కుమార్ నియమితులన్నాయి... ఆయన పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయస్సు వరకు ఉంటుంది. ప్రస్తుతం కమిషన్‌లో రెండు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి.
డాక్టర్ అజయ్ కుమార్ నియామకం UPSCకి అనుభవజ్ఞుడైన, వ్యూహాత్మక దృక్పథాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఆయన సాంకేతిక నైపుణ్యం, పరిపాలనా అనుభవం, సంస్కరణల దృక్పథం UPSC పారదర్శకత, సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని ఆశిస్తున్నారు.