
India Pakistan : ఏప్రిల్ 23, 2025న అంటే ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా, పాక్ ఉద్రిక్తతల వేళ ఆర్మీ జవాన్ పాక్ ఆర్మీ చేతికి చిక్కాడు. సరిహద్దుల్లో విధులు నిర్వహించే బిఎస్ఎఫ్ జవాన్ పొరపాటున సరిహద్దు దాటడంతో పాక్ ఆర్మీ పట్టుకుంది. అయితే అతడిని విడిపించేందుకు ఆర్మీ ఉన్నతాధికారుల చర్చలు సఫలమయ్యాయి.. తాజాగా పాక్ కస్టడీలో ఉన్న బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షా (పీకే షా)ని భారత్‌కు అప్పగించింది పాక్.
“ఏప్రిల్ 23, 2025 నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను ఈరోజు ఉదయం 10:30 గంటలకు అమృత్‌సర్‌లోని అటారీ జాయింట్ చెక్ పోస్ట్ వద్ద భారత్‌కు అప్పగించారు. ఈ అప్పగింత ప్రక్రియ ప్రశాంతంగా, నిర్ణీత నిబంధనలకు అనుగుణంగా జరిగింది” అని బీఎస్ఎఫ్ ప్రకటించింది.
“పాకిస్తాన్ రేంజర్స్‌తో బీఎస్ఎఫ్ నిరంతరంగా జరిపిన ఫ్లాగ్ మీటింగ్‌లు, ఇతర సంప్రదింపుల ద్వారా బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను తిరిగి స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైంది” అని బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.
182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్ ఇండియా, పాకిస్థాన్ బార్డర్ లోని వ్యవసాయ భూముల దగ్గర విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరిగిన మరుసటి రోజు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతులతో కలిసి వెళ్తున్నప్పుడు షా అనుకోకుండా సరిహద్దు ఫెన్సింగ్ దాటినట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో నీడ కోసం ముందుకు నడిచిన సింగ్‌ను పాకిస్తాన్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.నాలుగు రోజుల సైనిక ఘర్షణ తర్వాత భారత్-పాకిస్తాన్ సైనిక అవగాహనకు రావడంతో పీకే షా విడుదల జరిగింది. 26 మంది మరణించిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూర్ ఆపరేషన్ చేపట్టింది.