మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం, నీరు ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి నిద్ర విషయంలో చేసే కొన్ని తప్పులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఓ తప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జీన్స్ ధరించడం ఒక ట్రెండ్‌లా మారింది. చిన్న పిల్లలు మొదలు, పెద్దల వరకు జీన్స్ ధరిస్తున్నారు. షర్ట్స్, టీషర్ట్స్ ఇలా వేటిపైకి అయినా జీన్స్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో తయారయ్యే ఈ జీన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. స్టైల్‌కు పెట్టింది పేరైన జీన్స్‌ను ఆడ,మగ అనే తేడా లేకుండా అందరూ ధరిస్తుంటారు. అయితే జీన్స్ ధరించడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలు మరెన్నో ఇబ్బందులకు ఇది దారి తీస్తుందని అంటున్నారు.
మరీ ముఖ్యంగా రాత్రుళ్లు జీన్స్ ధరించే పడుకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు. సాధారణంగా రాత్రుళ్లు ప్రత్యేకమైన నైట్ డ్రస్‌లను ధరిస్తుంటారు. అయితే కొందరు మాత్రం రాత్రి కూడా ఉదయం ధరించిన దుస్తులతోనే నిద్రిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. పగలు బయటి వాతావరణంలో ఉంటాం కాబట్టి గాలి వెలుతురు తగులుతుంది. కానీ రాత్రుళ్లు అలా ఉండకపోవడంతో చమట ఎక్కువగా పడుతుంది.
జీన్స్ క్లాత్‌కు చెమటను పీల్చుకునే లక్షణం ఉండదు. దీంతో చర్మంపై చెమట పేరుకుపోతుంది. ఇది చర్మంపై ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఇది చర్మ సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చర్మ వైద్యులు చెబుతున్నారు. దద్దుర్లు, దురద, ఇన్ఫెక్షన్లకు ఇది కారణమవుతుందని అంటున్నారు.
రాత్రుళ్లు జీన్స్ ధరించడం పడుకోవడం వల్ల తొడల మధ్య గాలి అస్సలు ఉండదు. దీంతో చర్మం కందిపోతుంది. చర్మం నల్లగా మారుతుంది. తొడలు ఒకటికొకటి రాసుకుపోవడం వల్ల చర్మం కందిపోయి దురద వస్తుంది. పురుషుల్లో సంతాన సమస్యకు కూడా ఇది కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. టైట్‌గా ఉండే జీన్స్‌ను ధరించడం వల్ల ప్రైవేట్ పార్ట్‌లకు రక్తప్రసరణ సరిగా జరగదు. ఇది వీర్య కణాల నాణ్యతపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. అలాగే వేడి కారణంగా శుక్ర కణాల ఉత్పత్తి కూడా తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఇది కూడా పురుషుల్లో సంతానలేమికి కారణమవుతుంది.
రాత్రుళ్లు జీన్స్ ధరించిపడుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కడుపు భాగంపై ఒత్తిడి పడడం వల్ల కడుపునొప్పి, గ్యాస్ వంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే నడుం భాగంపై ఒత్తిడి ఎక్కువగా పడడం వల్ల నడుము నొప్పి వస్తుంది. మహిళల్లో నెలసరి సమయంలో మరింత ఇబ్బందికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రుళ్లు పడుకునే సమయంలో ధరించే దుస్తుల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గాలి బాగా ఆడేలా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ముఖ్యంగా చర్మానికి మృదువుగా ఉండే కాటన్ ప్యాంట్‌లను ధరించాలి. ఇలాంటి దుస్తులు చమటను సులువుగా పీల్చుకుంటుంది. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.