ఆదివారం వచ్చిందంటే ఇంట్లో కచ్చితంగా చికెన్ ఉండాల్సిందే. అయితే ప్రతీసారి ఒకేలా వండుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. వెరైటీగా ట్రై చేస్తే భలే ఉంటుంది కదూ! మరి ఎప్పటిలాగా కాకుండా ఈ ఆదివారం చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్లంతా లొట్టలేసుకొని తినడం ఖాయం..
చికెన్‌తో ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చని తెలిసిందే. ఏ పేరుతో పిలుచుకున్నా చికెన్‌తో చేసిన వంటకం రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రకరకాల వంటకాలను చికెన్‌తో ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా చికెన్ ఫ్రై చేసుకుంటే అటు అన్నంతో పాటు పుల్కా, చపాతీల్లో కూడా సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా చేసుకునే ఈ చికెన్ ఫ్రై తయారీకి కావాల్సిన వస్తువులు ఏంటి.? తయారీ విధానం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
* కిలో చికెన్
* ఉప్పు తగినంత
* నిమ్మరసం
* ఆయిల్
* ఉల్లిగడ్డ
* అల్లంవెల్లుల్లి పేస్ట్
* కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి.
* మసాలా తయారీ కోసం యాలకులు, లవంగాలు, ఎండు కొబ్బరి, ఎండు మిర్చి, ధనియాలు, మిరియాలు, బిర్యానీ ఆకు.
ముందుగా ఒక కిలో చికెన్‌ను తీసుకొని శుభ్రం కడుక్కోవాలి. ఉప్పు వేసుకొని కడుక్కుంటే చికెన్ ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది. అనంతరం చికెన్‌ను మేరినెట్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా కడిగిన చికెన్‌ను ఒక బౌల్‌లో వేసుకోవాలి. అనంతరం అందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, సరిపడ మంచి నూనె వేసుకుని బాగా కలిపి కనీసం అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టౌవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్‌ను పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జిలకర్ర వేసుకోవాలి, ఆ తర్వాత చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసి వేయించాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలను రోస్ట్ చేయాలి. ఉల్లిపాయ గోల్డ్ కలర్‌లోకి మారిన తర్వాత రెండు స్పూన్‌ల అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. అనంతరం అప్పటికే మేరినెట్ చేసుకున్న చికెన్‌ను అందులో వేసి బాగా కలుపుతుండాలి.
మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. చికెన్ బాగా ఉడికి తర్వాత ఇందులో మసాలా వేసుకోవాలి. ఇక మార్కెట్లో దొరికే మసాలా కంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే రుచి మరింత ఎక్కువగా ఉంటుంది. మసాలా తయారీ కోసం మిక్సీలో జార్‌లో ముందుగా దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, యాలకులు, ఆనసా పువ్వు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండు మిర్చి, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలా పొడి రడీ అయినట్లే.
ఇక చికెన్ ఉడుకుతున్న సమయంలో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసికలుకోవాలి. చికెన్‌లో ఉన్న నీరంతా ఆవిరి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అనంతరం అంతకుముందు రడీ చేసుకున్న మసాలను వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం చికెన్ పూర్తిగా ఫ్రైగా మారేంత వరకు కలుపుతూ ఉండాలి. పూర్తిగా డ్రైగా మారే వరకు ఇలాగే చేయాలి. దీంతో చికెన్ ముక్క బాగా ఉడికి క్రిస్పీగా మారుతుంది. అంతేనండి రుచికరమైన చికెన్ ఫ్రై రడీ అయినట్లే. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ట్రై చేసేయండి.