
ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు రావడం సర్వసాధారణం. కష్టం వచ్చిన సమయంలో మనిషి ఎలా ఉంటాడన్న దానిబట్టే అతని జీవన గమనం ఆధారపడి ఉంటుంది. అందుకే సమస్యలు ఎదురైన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతుంటారు. గీతలో కూడా ఇందుకు సంబంధించి శ్రీకృష్ణభగవానుడు వివరించారు. జీవితంలో సమస్యలు వచ్చిన సమయంలో కచ్చితంగా మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. అవేంటంటే..
మిమ్మల్లి ఎవరైతే సమస్యలకు గురి చేస్తారో వారిని ఎప్పటికీ మర్చిపోకండి. మనకు మంచి చేసిన వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మనకు ద్రోహం చేసిన వారిని, మనల్ని మోసం చేసిన వారిని, సమస్యల్లో పడేసిన వారిని కూడా అంతే గుర్తుంచుకోవాలి. భవిష్యత్తుల్లో ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండండి. వారిని వీలైనంత వరకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి. ఒకసారి మిమ్మల్ని సమస్యల్లో పడేసిన వారికి మిమ్మల్ని మళ్లీ ఇబ్బందులకు గురి చేయడం పెద్ద విషయం కాదు. కాబట్టి వారితో జీవితాంతం జాగ్రత్తగా ఉండాలి.
సమస్య వచ్చిన సమయంలో ఎవరైతే మిమ్మల్ని వదిలేస్తారో వారిని కూడా కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వారు మీవారు కాదని, పరాయి వారని అర్థం. అంతా బాగున్నప్పుడు మీ వెన్నంటే నిలిచే వారు కాదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో ఉన్న వారే మీవారు అనే సత్యాన్ని గుర్తించండి. అలాంటి వారితోనే స్నేహాన్ని కొనసాగించండి. మీకు సమస్యలు వచ్చినప్పుడు గాలికి వదిలేసే వారితో జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తులో కూడా వారి నుంచి ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. వారు అండగా ఉంటారని పొరపాటున కూడా నమ్మకండి.
మీకు సమస్యలు వచ్చిన సమయంలో మీ వెన్నంటే ఎవరు ఉంటారో వారిని కూడా ఎప్పటికీ మర్చిపోకూడదు. వీరే మీకు నిజమైన ఆప్తులు అని అర్థం చేసుకోవాలి. సమస్య వచ్చిన సమయంలో మీ వెన్నంటే నిలిచి మీకు ధైర్యాన్ని ఇస్తారో, ఎవరైతే మీకు భరోసా కల్పిస్తారో వారే మీకు అసలైన మిత్రులు, సన్నిహితులు అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకండి.