రోజూ ఉదయం నాలుగు కరివేపాకులను నమలండి చాలు.. ఊహకందని మార్పులు..

By Narender Vaitla  |  First Published Jan 2, 2025, 6:46 PM IST

కరివేపాకు లేనిది ఏ కూర పూర్తి కాదని తెలిసిందే. వంటకు రుచిని అందించే కరివేపాకు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే కరివేపాకును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. రోజూ ఉదయాన్నే నాలుగు కరివేపాకులను నమలడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులోని లినాలూల్, ఆల్ఫా-టెర్పెన్, మైర్సీన్, మహానింబైన్, క్యారియోఫిలీన్, ఆల్ఫా-పినెన్, మురయానాల్, విటమిన్లు ఎ, బి, సి, ఇ, కాల్షియం వంటివి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కూరలో కచ్చితంగా వేసే కరివేపాకును నేరుగా నమిలితే బోలెడు లాభాలు ఉంటాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పడగడుపున 4 నుంచి 5 కరివేపాకులను నేరుగా నమిలి ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. అవేంటంటే.. 

నోటి ఆరోగ్యం 

Latest Videos

నోటి ఆరోగ్యానికి కరివేపాకు క్రీయాశీలకంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం కరివేపాకులను నమలడం వల్ల దంతాల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీంతో దంతాలు కుళ్లిపోయే ప్రమాదం తగ్గుతుంది. నోటిలోని బ్యాక్టీరియాకు చెక్‌ పెట్టడం వల్ల నోటి దుర్వాసన సమస్య సైతం దూరమవుతుంది. 

నిరోధక శక్తి 

రోజూ ఉదయాన్నే పడగడుపున కరివేపాకులను తీసుకోవడం వల్ల నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో కరివేపాకులను మరిగించి తాగడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. తరచూ వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. 

బరువు తగ్గడంలో 

బరువు తగ్గాలనుకుంటున్నారా. అయితే ప్రతీ రోజూ ఉదయం కరివేపాకులను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకులో ఉండే డైక్లోరోమీథేన్, ఇథైల్ అసిటేట్ వంటి మూలకాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తాగితే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. 

డయాబెటిస్‌..

మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారికి కరివేపాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నములుతుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇది హైపోగ్లైసీమిక్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని తగ్గించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. 

కంటి ఆరోగ్యానికి.. 

కరివేపాకు విటమిన్‌ ఏకి పెట్టింది పేరు. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపు తగ్గుతున్నా, మసకబారినట్లు కనిపిస్తున్నా కరివేపాకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. 

కాలేయ ఆరోగ్యం 

లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని టానిన్, కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి అంశాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

జీర్ణ సమస్యలు 

జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ఖాళీ కడుపుతో కరివేపాకును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

ఒత్తిడి పరార్‌.. 

కేవలం శారీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా కరివేపాకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్‌ ఒత్తిడిని చిత్తు చేస్తాయి. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

click me!