Texas Shooting: స్కూల్‌లో వేధింపులు.. ఇంటిలోనూ తగువులే.. టెక్సాస్ షూటర్ జీవితమంతా అస్తవ్యస్తం

By Mahesh KFirst Published May 25, 2022, 1:50 PM IST
Highlights

అమెరికాలోని టెక్సాస్‌లో చిన్నారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన షూటర్ జీవితాన్ని తరిచి చూస్తే అంతా గందరగోళమే కనిపిస్తుంది. ఆయన ఇంటిలోనూ తగువులే.. డ్రగ్స్ తీసుకునే తల్లితో ఆయనకు తరుచూ గొడవలు జరిగేవి. స్కూల్‌లోనూ నత్తితో వేధింపులు ఎదుర్కొని తరుచూ డ్రాపౌట్‌గా మిగిలాడు.
 

న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మహాపురుషుడు అయినా.. నేరగాడు అయినా.. ఆయన చుట్టూ ఉన్న ప్రపంచమే అందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. ఈ కోణంలోనే అమెరికాలోని టెక్సాస్‌లో మారణహోమం సృష్టించిన షూటర్ సాల్వడార్ రొలండో రామోస్ జీవితాన్ని చూస్తే ఆందోళనకర విషయాలు వెలుగుచూస్తాయి. ఆయన జీవితమంతా అస్తవ్యస్తంగా ఉన్నది. వ్యక్తిగత జీవితం.. ఆయన బయట తిరిగే, పని చేసే ప్రాంతాల్లోనూ తీవ్ర మానసిక ఒత్తిడితోనే గడిపాడని అర్థం అవుతున్నది. బాహ్య ప్రపంచం ఒక మనిషి మానసిక జీవితంపై తీవ్ర ప్రభావం వేస్తుంది. అదే విధంగా మనుషుల మానసిక స్థితులే స్థూలంగా ప్రపంచాన్నీ ప్రభావితం చేస్తుంటాయి. ఈ కోణంలోనే టెక్సాస్ ‌లోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో చిన్నారులను పొట్టనబెట్టుకున్న షూటర్ సాల్వడార్ రొలాండో రామోస్ జీవితాన్ని తరచి చూద్దాం. ఆయన జీవితం అస్తవ్యస్తంగా ఉన్నంత మాత్రానా నేరాన్ని సమర్థించే అవకాశమే లేదనేది సుస్పష్టం.

అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థలు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టుల కథనాల సమాచారం మేరకు.. సాల్వడార్ రొలాండో రామోస్.. ఉవాల్డే ఏరియాలో వెండీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో నైట్ మేనేజర్‌గా పని చేస్తుండేవాడు. ఉన్నట్టుండి ఆయన హ్యాండ్ గన్, సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌లతో ఎలిమెంటరీ స్కూల్‌లోకి వెళ్లి చిన్నారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేవు.

అయితే, సాల్వడార్ గురించి తెలిసిన కొందరు ఆయన జోకులు వేస్తూ సరదాగా గడిపేవాడని చెప్పారు. కానీ, ఆయన సహోద్యోగులు, సహ విద్యార్థులను అడిగితే మాత్రం ఇందుకు విరుద్ధమైన సమాధానాలు వచ్చాయి. ఆయన ఇంటిలోనూ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సాల్వడార్ సహోద్యోగులను ఆయన గురించి వాకబు చేస్తే.. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ ఎదురుబడి మాట్లాడేవాడు కాదని, తనను తాను వేరుగా.. ఐసొలేట్ చేసుకుని ఉండేవాడని వివరించారు. అసలు చాలా మందికి ఆయన ఒకడు ఉన్నాడనే విషయమే తెలియదని పేర్కొన్నారు.

సాల్వడార్ కుటుంబంతో పరిచయం ఉన్న ఇద్దరు పేరెంట్స్ ఆయన గురించి మరీ విచిత్రంగా చెప్పారు. సాల్వడార్ చాలా సీరియస్‌గా కనిపించేవాడని పేర్కొన్నారు. ఎప్పుడూ కోపంతో రుసరుసలాడేవాడని వివరించారు. సాల్వడార్ తన బాల్యంలో తల్లి వెనక్కి వెళ్లి తరుచూ ఆమె చెవిలోనే ముచ్చట్లు చెప్పేవాడని పేర్కొన్నారు.

కాగా, ఆయన మిత్రులు, బంధువులు మాత్రం.. సాల్వడార్ చాలా ఒంటరిగా ఉండేవాడని తెలిపారు. 18 ఏళ్ల ఒంటరి పిల్లాడు అని చిత్రించారు. సాల్వడార్ బాల్యంలో నత్తితో బాధపడేవాడని, తన బాల్యమంతా చాలా మంది నుంచి ఈ కారణంగా వేధింపులు ఎదుర్కొన్నాడని వివరించారు. అంతేకాదు, ఆయన ఇంటిలోనూ పరిస్థితులు బాగాలేవని, గత కొన్నేళ్లుగా ఆయన తన సహచరులను, అపరిచితులపైనా హింసాత్మకంగా విరుచుకుపడుతున్నాడని తెలిపారు. 

సాల్వడార్ తరచూ వేధింపులకు గురి కావడం మూలంగా స్కూల్ వెళ్లాలంటే జంకేవాడు. స్కూల్ వెళ్లడానికి ఇష్టపడకపోయేవాడు. అందుకే తరచూ ఆయన స్కూల్ డ్రాపౌట్‌గానే మిగిలేవాడని వివరించారు. హైస్కూల్‌లో ఆయన చాలా దీర్ఘమైన క్లాసులు మిస్ అయ్యాడని క్లాస్‌మేట్లు చెప్పారు. సాల్వడార్ ఈ ఏడాది తమతో గ్రాడ్యుయేట్ చేయాల్సిన వాడని, కానీ, ఆయన తమతో ట్రాక్ తప్పిపోయాడని వివరించారు.

సోషల్ మీడియాలో ఓ ఏడాది క్రితం సాల్వడార్ తన విష్ లిస్టులో గన్‌ను కూడా చేర్చాడని ఆయన మిత్రుడు ఒకరు చెప్పారు. నాలుగు రోజుల క్రితం రెండు రైఫిళ్ల చిత్రాలను పోస్టు చేసి.. మై గన్ పిక్స్ అని సాల్వడార్ పేర్కొన్నాడని గుర్తు చేశారు.

సాల్వడార్ ఇంటిలో తరుచూ తగువులు అవుతుండేవని తెలిసింది. సాల్వడార్ తల్లి డ్రగ్స్ తీసుకుంటారని సమాచారం. ఆమెతో సాల్వడార్‌కు తరుచూ గొడవలు అవుతుండేవని తెలిసింది.

టెక్సాస్‌లో పిల్లలను పొట్టనబెట్టుకున్న సాల్వడార్‌ను పోలీసులు కాల్చి చంపేశారు.

click me!