పాక్ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం.. సుప్రీంకోర్టు మ‌హిళా న్యాయ‌మూర్తిగా అయేషా మాలిక్ !

By Mahesh RajamoniFirst Published Jan 7, 2022, 4:46 PM IST
Highlights

Pakistan first woman SC judge: పాకిస్థాన్ చ‌రిత్ర‌లో మ‌రో సంచ‌ల‌నం ఆవిష్కృతమైంది. 74 సంవ‌త్స‌రాల స్వ‌తంత్య్ర పాక్‌లో సుప్రీంకోర్టులో మొట్ట‌మొద‌టి సారి ఓ మ‌హిళా.. న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. అనేక అడ్డంకుల‌ను ఎదుర్కొని జ‌స్టిస్ అయేషా మాలిక్ పాక్ సుప్రీంకోర్టులో న్యాయ‌మూర్తిగా అడుగుపెట్ట‌బోతున్నారు.
 

Pakistan first woman SC judge: పాకిస్థాన్ చ‌రిత్ర‌లో మ‌రో సంచ‌ల‌నం ఆవిష్కృతమైంది. మ‌హిళ హ‌క్కుల‌కు పెద్ద‌గా ప్ర‌ధాన్యం ఇవ్వ‌ని పాకిస్థాన్ లో 74 సంవ‌త్స‌రాల స్వ‌తంత్య్ర  పాక్‌లో సుప్రీంకోర్టులో మొట్ట‌మొద‌టి సారి ఓ మ‌హిళా న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. అనేక అడ్డంకుల‌ను ఎదుర్కొని జ‌స్టిస్ అయేషా మాలిక్ పాక్ సుప్రీంకోర్టులో న్యాయ‌మూర్తిగా అడుగుపెట్ట‌బోతున్నారు. పాక్ ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్  జ్యుడీషియల్ కమిషన్ (Judicial Commission of Pakistan) గురువారం స‌మావేశ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఐదు ఓట్ల మెజారిటీతో జస్టిస్ అయేషా మాలిక్‌ను సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఆమోదించింది. లాహోర్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అయేషా మాలిక్.. పాకిస్థాన్ మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై.. చ‌రిత్ర సృష్టించారు. 

అయితే, ఆమె ఎంపిక‌కు సంబంధించి చాలా అడ్డంకులే ఎదుర‌య్యాయి. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఆమెను ఎంపిక చేయ‌డానికి Judicial Commission of Pakistan రెండు సార్లు స‌మావేశం కావాల్సి వ‌చ్చింది. అయేషా మాలిక్‌ పదవిపై నిర్ణయం తీసుకునేందుకు గత ఏడాది సెప్టెంబర్ 9న Judicial Commission of Pakistan స‌మావేశ‌మైంది. అయితే, ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండానే ఆ స‌మావేశం ముగిసింది. తాజా స‌మావేశంలో ఆమెను ఎంపిక చేశారు. అయితే, అంత‌కు ముందు పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ లతీఫ్ ఆఫ్రిది ఆమె పేరును పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. దేశంలోని ఐదు హైకోర్టుల్లో పనిచేస్తున్న చాలా మంది న్యాయమూర్తుల కంటే జస్టిస్ మాలిక్ జూనియర్ అని అఫ్రిది పేర్కొన్నారు. జస్టిస్ అయేషా మాలిక్ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఎంపిక చేస్తే.. కోర్టులను బహిష్కరిస్తామని కూడా  పాకిస్థాన్ బార్ కౌన్సిల్ (పీబీసీ) హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.  

ఇక ప్ర‌స్తుతం  పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ సిఫార్సును పార్లమెంటరీ కమిటీ పరిశీలించనుంది. అయితే, చాలా సందర్భాలలో ఈ కమిటీ JCP సిఫార్సుతో ఏకీభవిస్తుంది. కాబ‌ట్టి  జ‌స్టిస్ అయేషా మాలిక్ ఇప్పుడు పాకిస్థాన్ మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కావడానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. కాగా, జ‌స్టిస్ అయేషా మాలిక్  లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా‌(PCL)లో ఆమె లా చదువుకున్నారు. ఆ తర్వాత లండన్‌లోని హార్వర్డ్ లా స్కూల్‌లో లా‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కరాచీలో 1997 నుంచి 2001 వరకు న్యాయవాదిగా పనిచేశారు. 2012లో లాహోర్ హైకోర్టు జడ్జిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, బ్యాంకింగ్ కోర్టులు, స్పెషల్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్స్‌లలో ఆమె సేవలందించారు. అనేక కీల‌క కేసుల్లో తీర్పులు వెల్ల‌డించారు. ప్రస్తుతం ఆమె లాహోర్ హైకోర్టులో నాల్గవ సీనియర్ న్యాయమూర్తి.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆమె సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌డితే ఆమె ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే స‌మయానికి పాకిస్థాన్ సుప్రీంకోర్టులో సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉంటారు. అంటే పాకిస్థాన్ అత్యున్న‌త న్యాయ‌స్థానం తొలి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అయ్యే అవ‌కాశాలు సైతం ఉన్నాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్‌గా ఓ మహిళ నియమితులుకానుండటం ఓ మంచి వార్త అంటూ డాన్ పత్రిక వ్యాఖ్యానించింది. ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు సైతం ఈ విష‌యం ప్ర‌శంసించ‌ద‌గిన‌దని పేర్కొంటున్నాయి. 

 

click me!